మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ ఆనం
వైసిపి పాలనపై ఎంఎల్‌ఎ ఆనం కీలక వ్యాఖ్యలు
రాపూరు:వైసిపి పాలనపై వెంకటగిరి నియోజకవర్గ ఎంఎల్‌ఎ ఆనం రామనారాణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో బుధవారం నూతనంగా నియమించిన సచివాలయ వైసిపి కన్వీనర్లు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ఏ పనులు చేశామని ప్రజలు ఓట్లు వేస్తారని విమర్శించారు. కనీసం రోడ్లపైన గుంతలు కూడా పూడ్చలేకపోయామన్నారు. తాగడానికి నీళ్లు అడిగితే కేంద్ర నిధులు వచ్చేవరకు ఆగమని చెబుతున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టామా? లేకపోతే కొత్త వాటికి ఏమైనా శంకుస్థాపన చేశామా? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తే ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వారికి తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నామని వాపోయారు. అదేవిధంగా లేఅవుట్ లు వేశామని, ఇల్లు ఒకటైన కట్ట గలిగామ అని ప్రశ్నించారు. కేవలం పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అలాగైతే గత ప్రభుత్వం పింఛన్లు ఇచ్చింది కదా అని ఆయన హాట్ కామెంట్ చేశారు. మరి ఇంకా ఏం చూసి మనకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఎస్‌ఎస్‌కెనాల్ కడతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామన్నారు. మూడున్నరేళ్లు అయినా పట్టించుకోలేదన్నారు.సిఎంకు ఎన్నోమార్లు చెప్పామన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చించామన్నారు.ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు.కంటిముందు నీళ్లు ఉన్నాయని సంతోష పడడమే గాని తాగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కండలేరు దగ్గర ఉన్న రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపిన పాపాన పోలేదన్నారు.కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్‌ఆర్ కలను నెరవేర్చలేకపోయామన్నారు.గ్రామాల్లో బిందెడు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని ధ్వజమెత్తారు.










