Feb 01,2023 22:13

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గదర్శిసభ్యులు వెంకటేశ్వరరావు

        ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాల్లోనూ మితిమిరీన భూకబ్జాలు పెరిగాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గదర్శి సభ్యులు వెంకటేశ్వరరావు విమర్శించారు. బుధవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నాయకులు దర్జాగా కబ్జా చేస్తూ భూవ్యాపారాలకు తెరలేపారన్నారు. లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూములను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కబ్జాలు చేశారన్నారు. ప్రభుత్వ భూములు అన్నింటినీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. కబ్జా చేసిన భూములను రెండవ విడత భూపంపిణీ కింద పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అభివద్ధి, పరిశ్రమలు, జాతీయరహదారుల పేరిట ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు సంబంధించి రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా భూములను లాక్కొంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పరిగిలో జాతీయ రహదారి నిర్మాణం పేరుతో పేదలు ఇళ్లను తొలగించి వారిని రోడ్డు పాలుజేశారన్నారు. పేదలను రోడ్డుమీద పడేయడమే జగన్‌ పాలనా అని ప్రశ్నించారు. ఇక కేంద్రంలోని బిజెపి సైతం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసి పాలన సాగిస్తోందన్నారు. ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ నేటికీ ఒక్క రుపాయి కూడా కేటాయించలేదన్నారు. బీజేపీకి వైసీపీ భయపడి రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సిఎం జగన్‌ విశాఖను రాజధానిగా చేయడంతో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడటానికి కారణం ప్రస్తుత పాలక పెద్దలే అన్నారు. జగనన్నకాలనీల్లో గహాలకు కేరళ రాష్ట్రం మాదిరిగా రూ.6లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూసమస్యలు, చేనేత సమస్యలు, గిట్టుబాటుధర కల్పించాలనే తదితర అంశాలపై సిపిఎం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, సిఐటియు జిల్లా నాయకురాలు దిల్షాద్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, నాయకులు ఎస్‌హెచ్‌.బాషా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నామాల నాగార్జున పాల్గొన్నారు.