చాపాడు/ఖాజీపేట : రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామ సీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 115 రోజుకు చేరుకుంది. ఆదివారం మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలంలోని భూమాయపల్లె విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై ఇంజినీర్‌కొట్టాలు, పేరారెడ్డికొట్టాలు, బుడ్డాయపల్లె, ఖాజీపేట, పత్తూరు, దుంపలగట్టు, కొత్తపేట, చెన్నముక్కపల్లె విడిది కేంద్రం వరకూ పాదయాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, బలిజలు, రైతులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల లోకేష్ మాట్లాడుతూ సొంత ప్రాంతమైన రాయలసీమలో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. గ్రామ పంచాయతీలకు చెందిన రూ.8,660 కోట్లు జగన్ ప్రభుత్వం దొంగిలించడంతో పంచాయితీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధుల్లేవన్నారు. వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తి సిఎం కావడం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. జగన్ నిర్వాకం కారణంగా రాష్ట్ర రైతులు అప్పల్లో జాతీయ స్థాయిలో నెం.వన్‌గా నిలిచారన్నారు..టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.70వేలు ఉన్న రైతుల సగటు అప్పు, జగన్ నాలగేళ్ల పాలనలో రూ.2.5 లక్షలకు చేరిందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరిగా డ్రిప్ సబ్సిడీని పునరుద్దరిస్తామని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దళారీల బెడదను నివారిస్తామన్నారు. బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారన్నారు. రాయలసీమలో బలిజల్ని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని తెలిపారు. తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదనే ఆలోచనలో విదేశీ విద్య పథకం రద్దు చేశారని విమర్శించారు. గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్ కి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. టిడిపి రాజంపేట పార్లమెంటు నుండి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రాజంపేట ఎంపీ సీటును మిథున్‌రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారన్నారు. తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ సొంత వర్గానికి కట్టబెట్టాడన్నారని తెలిపారు. బజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్య, సుపులేటి బ్రహ్మయ్య, చదలవాడ కృష్ణమూర్తి, బి.కె.సత్యప్రభ, ఆమె భర్త ఆదికేశవులు నాయుడులకు పలు రాజకీయ అవకాశాలు కల్పించామన్నారు. విద్యా, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ మేరకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3100 కోట్లు ఖర్చు చేశామని, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పధకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్ధుల్ని విదేశాల్లో చదివించామని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా 66.50 కోట్లు రుణాలుగా ఇచ్చామని, 33,594 మందికి నైపుణ్యాభివద్ధి శిక్షణ ఇచ్చామన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకిచ్చామని, ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో కాపు భవన్‌లను నిర్మించామని తెలిపారు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి రుణం ఇవ్వకుండా కాపులను ఆర్దికంగా, రాజకీయంగా దెబ్బతీశాడన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన విదేశీ విద్య పథకం, నిరుద్యోగ భృతి మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించామన్నారు. మీ-సేవ నిర్వాహకుల ఇబ్బందులను గమనించి గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలాలు ఇచ్చి, కమీషన్ కూడా పెంచామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ-సేవ కేంద్రాల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా ఇచ్చే సర్టిఫికెట్లను అధికారికంగా గుర్తిస్తామన్నారు. ప్రజలపై పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేదన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రోడ్లపై తట్టమట్టిపోసే దిక్కులేదని తెలిపారు. వైసిపి నేతలు శ్మశానాలను సైతం వదలకుండా ఆక్రమించడం దారుణమన్నారు. పాదయాత్రలో కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి, మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్, టిడిపి నాయకులు హరిప్రసాద్, ధనపాల జగన్, బిఎన్ శ్రీనివాసులు, దాసరి బాబు, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి, పత్తూరు ఉప సర్పంచ్ ముత్తూరు రమణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సందుల నాగశివారెడ్డి, శ్రీరాముల యాదవ్, నరసింహులు యాదవ్, కొంగాని వెంకటసుబ్బయ్య, జెండాల మహబూబ్ బాషా, కమలాపురం ఫరూక్, కమలాపురం గౌస్, శంకర్ నాయుడు, టిడిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.










