Jun 02,2023 21:18

యువగళం పాదయాత్రలో మైదుకూరు టిడిపి నాయకులు

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు పుట్టపర్తిసర్కిల్‌/చాపాడు
వైసిపి పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు, భూములకు రక్షణ కరువైందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర 114వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రా రంభమై మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నాగులాపల్లి క్రాస్‌, ఖాదర్‌పల్లి, చాపాడు, సీతారాంపురం క్రాస్‌, చియ్యపాడు క్రాస్‌, అల్లాడుపల్లె దేవలాలు, కేతవరం, పుల్లయ్య సత్రం, విశ్వనాథపురం విడిది కేంద్రం వరకూ పాద యాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, దళితులు, రైతులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల లోకేష్‌ మాట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి వారిపైనే ఉక్కుపాదం మోపుతూ తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దళితులకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను లాక్కున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గత నాలుగేళ్లలో దళితుల వద్ద ఉన్న భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని తెలిపారు. ఎస్సీలకు చెందాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.28,147 కోట్లు దారిమళ్లించారని తెలిపారు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అండ్‌కోకు ఇసుక, మట్టి అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదన్నారు. నాలుగేళ్లలో బినామీ సంస్థను అడ్డంపెట్టుకొని ఇసుక ద్వారా జగన్‌ రూ.10 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. జగన్‌ ధనదాహం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61 మంది అమాయకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలవాల్సిన అధికారులు వైసిపి తొత్తులుగా మారడం దురదష్టకరమని తెలిపారు. జగన్‌ పాలనలో అన్ని రంగాల వారు బాధితులేనన్నారు. సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకి ఏం చేశాడో జగన్‌ చెప్పగలడా? అని ప్రశ్నించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 కి 10 సీట్లు ఇస్తే జగన్‌ చేసింది ఎంటన్నారు. దొంగ చేతికి తాళం ఇస్తే ఎం జరిగింది? అందరూ దోపిడీకి గురయ్యారని విమర్శించారు. లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, టీచర్లు, ఐటి నిపుణులు అందరూ జగన్‌ చేతిలో బాధితులేనని, వీరి విపరీతంగా జగన్‌ వేధిస్తున్నారని తెలిపారు. జగన్‌ పాలనలో ఎపి బీహార్‌తో పోటీ పడుతోందన్నారు. ప్రస్తుతానికి షాపులు, వ్యాపారాల మీద దాడి చేస్తున్నారనీ, మరో సారి ఓటేస్తే జగన్‌ అండ్‌ కో ఇంటికొచ్చి దోచుకుంటారని తెలిపారు. టిడిపి హయాంలో న్యాయ విభాగానికి నిధులు కేటాయించి కొత్త భవనాలు, లైబ్రరీలు కట్టించడానికి పనులు ప్రారంభించామని, ఈ ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. జగన్‌ వేధింపుల వలన అన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయన్నారు. జగన్‌ వేదింపులు, జే ట్యాక్స్‌ కట్టలేక కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు. అమర్‌రాజా, ఫాక్స్‌ కాన్‌, రిలయన్స్‌ లాంటి సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లి పోయాయని తెలిపారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, టిడిపి కడప జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌ పాల్గొన్నారు.