Dec 07,2022 22:25

నిరసన ర్యాలీలో పాల్గొన్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : వైసిపి మూడున్నర ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారథి విమర్శించారు. బుధవారం బీసీలకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని బీసీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని గణేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపారు. అనంతరం డిఆర్‌ఒ భాగ్యరేఖకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సవితమ్మ, మాజీ జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బికె మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. పేరుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప ఏ ఒక్క దానికి నిధులు కేటాయించలేదన్నారు. వికేంద్రీకరణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. గట్టిగా మాట్లాడే బీసీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టిడిపి హయాంలో బీసీలకు అమలు చేసిన పథకాలన్నీ పునరుద్దించాలని డిమాండ్‌ చేశారు. వైసిపికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ నాయకులు రామాంజనేయులు, బెస్త చలపతి, గిరిధర్‌ గౌడ్‌, వడ్డే వెంకట్‌, సామకోటి ఆదినారాయణ, అంబులెన్స్‌ రమేష్‌, ఎల్‌ఐసి నరసింహులు, అంజినప్ప, ఆనంద్‌, ఈడిగ నీళ్ల రమణ, నారాయణస్వామి, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.