Jul 19,2021 20:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు సమావేశాల తొలిరోజైన సోమవారం వైసిపి నిరసన గళం వినిపించింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచానాలకు అనుమతి తెలపాలని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉభయసభల్లోనూ ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్‌లోకి దూసుకువెళ్లారు. తొలుత రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలని కోరుతూ. రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడుకి వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి నోటీసు ఇచ్చారు. తక్షణమే ఆ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ నోటీసును చైర్మన్‌ తిరస్కరించడంతో విజయసాయి రెడ్డితో పాటు వైసిపి ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన నిర్వహించారు. 'మరోసారి సమయం వచ్చినప్పడు చర్చిస్తాం' అని వెంకయ్యనాయుడు ఒక దశలో హామీ ఇచ్చినప్పటికీ వైసిపి సభ్యుల ఆందోళన కొనసాగింది. మరోవైపు లోక్‌సభలో. పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని కోరుతూ వైసిపి ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్ళారు. అంతకుముందు ఈ అంశంపై వైసిపి లోక్‌సభ పక్షనేత పివి మిథున్‌ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. వైసిపి ఎంపిలు ఒక్కసారిగా వెల్‌లోకి వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఎపి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసిపి ఎంపిలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత, పోచా బ్రహ్మానంద్‌ రెడ్డి, గురుమూర్తిలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను తక్షణం ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.