రాయచోటి : నారా లోకేష్ పాదయాత్రకు రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైసిపి నేతల్లో ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైసిపి నాయకులు పోలీసులను చెప్పు చేతల్లో పెట్టుకుని లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సష్టిస్తున్నారన్నారు.చిత్తూరు జిల్లాలోని బంగారు పాలెంలో పాదయాత్ర జరగకూడదనే ఉద్దేశంతో విద్యుత్తు సరఫరాను నిలిపి వేసి బహిరంగ సభను అడ్డుకున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రచార రథం ఎక్కి ప్రచారం చేయలేదా, ఆయనేమైనా చెట్లెక్కి ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. లోకేష్ బాబు పాదయాత్రకు మైకు వద్దన్నారు .జగన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో మైక్ వాడలేదా అని పేర్కొన్నారు. .గతంలో జగన్ పాదయాత్రకు నారా చంద్రబాబు నాయుడు అన్ని రకాల అనుమతులు ఇచ్చి సహకరించారన్నారు. చంద్రబాబు నాయుడు వైసిపి ప్రభుత్వం లాగా వ్యవహరించి ఉంటే జగన్‌రెడ్డి ఇంట్లో నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టేవాడు కాదని తెలిపారు. దేశంలో ఎంతోమంది పాదయాత్ర చేశారని ఏ ప్రభుత్వమూ ఇంత దారుణంగా ప్రవర్తించలేదన్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ బాబు చేపట్టిన 4000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యే లోపు ఒక్కొక్కరుగా ఈ రాష్ట్రం విడిచి పారిపోయే పరిస్థితులు వైసిపి నాయకుల్లో కనపడుతున్నాయన్నారు. వైసిపి నాయకులకు లోకేష్ పోబియా పట్టుకుందన్నారు. జగన్ ఎన్ని అడ్డంకులు సష్టించినా యువగలం అండతో ప్రజల దీవెనలతో లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష, సంబేపల్లి మండల టిడిపి అధ్యక్షులు చిన్న రెడ్డయ్య యాదవ్, రాయచోటి మండల టిడిపి అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, గాలివీడు క్లస్టర్ ఇన్‌ఛార్జి సత్యారెడ్డి, రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు సుబ్బయ్య నాయుడు, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బడుగు వాసుదేవుడు, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రచార కార్యదర్శి మహబూబ్ అలీఖాన్ పాల్గొన్నారు.
- మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి










