Dec 05,2022 22:10

సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరోమారు రాయలసీమకు దగా చేస్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. సోమవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతం నుంచి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని ఆయన హయాంలో రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతోందని అన్నారు.కడప ఉక్కు రాయలసీమ హక్కు అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి నాలుగు సంవత్సరాలు అయినాకడప ఉక్కు గురించి మాట్లాడడం గాని పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేయడం గానీ చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు తెరపైకి తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం యువత ఉపాధి కోసం ఏ ఒక్క పరిశ్రమమైన తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా లబ్ధి పొందాలని వైసిపి చూస్తోందని అన్నారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు మోపురిశెట్టి చంద్రశేఖర్‌, మాజీ మండల కన్వీనర్‌ దాదెం శివారెడ్డి, తెలుగు యువత నాయకులు గంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.