- మచిలీపట్నం, తిరువూరుల్లో సిపిఎం, సిపిఐ నిరసన
ప్రజాశక్తి-కలెక్టరేట్
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి అధికార పార్టీ వైఎస్‌ఆర్ పార్టీ,ప్రతిపక్ష టిడిపి పార్టీ బేషరతుగా మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం స్థానిక రేవతి సెంటర్లో సిపిఎం, సిపిఐ మచిలీపట్నం కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రపతి అభ్యర్థికి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష టీడీపీలు మద్దతు ఇవ్వటం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆంధ్రుల హక్కులు, ఆత్మ గౌరవం తాకట్టుపెట్టినట్లే పేర్కొన్నారు. ఈ పార్టీల అవకాశవాదాన్ని ప్రజలందరూ ఖండించాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే, 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని ఆనాడు వాగ్దానం చేసిన వైసిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా నోరెత్తని పరిస్థితి నెలకొందన్నారు. ఒకరకంగా బిజెపి పార్టీకి మోకారిలేనట్లేనని ఈ పార్టీల విధానాలను ప్రజలు అందరూ ఖండించాలన్నారు. సిపిఐ జిల్లా నాయకులు మోదుమూడి రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడతాననీ, రాజధాని నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చిన బిజెపి పాలకులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అలాంటి నష్టదాయకమైన పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలోని టిడిపి, వైసిపి పార్టీలు మద్దతు ఇవ్వటం తీవ్ర అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి బూర సుబ్రమణ్యం, సిఐటియు జిల్లా కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి వి. జ్యోతి, పార్టీ కమిటీ సభ్యులు కె.శర్మ, సీహెచ్ రాజేష్, సి హెచ్. జయరావు, ఎండీ యునస్, వి.వి రమణ రావు, పీ.నాగయ్య. సిపిఐ నాయకులు ఎర్రంశెట్టి ఈశ్వరరావు, ఒడుగు చైతన్య, మహిళా సంఘం నాయకురాలు ఒడుగు రత్నకుమారి,తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి -తిరువూరు: తిరువూరు బోసు బొమ్మ సెంటర్‌లో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని సిపిఎం తిరువూరు పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్, సీపీఐ తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా విమర్శించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తుంటే అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బిజేపి బలపర్చిన రాష్ట్రపతి అభర్ధికి నిస్సుగ్గుగా ఓట్లు వేయటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వీ.భద్రం, జెట్టి శ్రీనివాసరావు, చప్పిడి సురేష్, కొత్తపల్లి సుందరరావు, షేక్ సుభాని పాల్గొన్నారు.










