- కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు
ప్రజాశక్తి - విజయవాడ
వైఎస్సార్ భీమా క్లెయిమ్‌ల పరిష్కారంపై శుక్రవారం ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ భీమా పథకం కింద నమోదైన క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కారించాలని, క్లెయిమ్‌దారుల జాబితాను సచివాలయాలలో అందుబాటులో ఉంచాలన్నారు. క్లెయిమ్‌లకు సంబంధించిన లబ్ధిదారులకు అవగాహన కల్పించి భీమా సౌకర్యం త్వరితగతిన పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్ భీమా పథకం కింద క్లెయిమ్‌లకు సంబంధించిన మరణధృవీకరణ పత్రాలను అధికారులు దరఖాస్తుదారులకు మూడు రోజుల్లో అందజేసి ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రమాదభీమాకు సంబంధించి పోలీస్ అధికారులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి పంచనామాను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య అధికారులు పోస్టుమార్టం రిపోర్టును ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తిచేసి గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శులకు అందించేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. క్యాదర్శులు వెబ్‌పోర్టల్ ద్వారా సంబంధిత రిపోర్టులను భీమా కంపెనీ వారికి అప్‌లోడ్ చేసి దరఖాస్తుదారులకు భీమా పరిహారాన్ని సకాలంలో అందించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వైఎస్సార్ భీమాకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో రెవెన్యూ అధికారులు సమీక్ష నిర్వహించి క్లెయిమ్‌లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి తత్సంబంధిత నివేదికను సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, జడ్‌పి సిఇఒ సూర్యప్రకాశ్‌రావు, డిప్యూటి కమీషనర్ ఆఫ్ లేబర్ ఆశారాణి, డిఆర్‌డిఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరావు, జిల్లాకు చెందిన మున్సిపల్ కమీషనర్లు, యంపిడివోలు పాల్గొన్నారు.
రైతు భరోసా కేంద్రాలపై అవగాహన కల్పించాలి
నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వ్యవసాయ సలహా మండలి సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తనాలు అందించే దగ్గర నుండి పంట కొనుగోలు వరకు రైతులకు సేవలు అందించేలా ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిపై వ్యవసాయ శాఖ అధికారులే రైతులకు పూర్తి అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రైతులకు ఆర్థికపరమైన అవసరాలను అందించాలనే ఉద్దేశ్యంతో రైతు భరోసా కేంద్రాల్లో బిజినెస్ కరస్పాండెంట్లను నియమించామని, వారు నిస్పక్షపాతంగా వ్యవహరించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా సలహామండలి సభ్యులు కొన్ని విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో సామూహిక రైతాంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామాలలో జరుగుతున్న భూసర్వే రైతులకు ప్రయోజనకరంగానే ఉంటుందని వారు వ్యక్తపరిచారు. రైతులకు శాశ్వత భూ హక్కులు లభించటమేకాక భవిష్యత్తులో భూ లావాదేవీల సమయంలో ఎటువంటి రిజిస్ట్రేషన్ల సమస్యలు తలెత్తవని సలహా మండలి సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా రైతులకు సబ్సిడిపై అందించే ఉపకరణాలను గ్రూపులుగా కాకుండా వ్యక్తిగతంగా అందిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సలహా మండలి సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పంట భూములలో నత్రజని స్థాపక ఎరువులు, సహజసిద్దంగా లభించే పిల్లపెసర, పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని రకాల తెగుళ్ళను తట్టుకునే విధంగా పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. కోతుల బెడదతో మామిడి, కూరగాయల తోటలకు తీవ్రనష్టం కలుగుతుందని సలహా మండలి సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై కలెక్టర్ స్పందించి కోతులకు హాని తలపెట్టకుండా వాటిని దూరప్రాంతాలకు పంపించే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అడంగల్‌లో తప్పుల సవరణలో రెవిన్యూ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములను సాగు చేస్తున్న మన జిల్లాకు చెందిన రైతులకు ఈ క్రాప్ బుకింగ్ తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయని సలహా మండలి సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులు డి దామోదర రెడ్డి, సయ్యద్‌నాగూర్‌మీరా, బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయభారతి పాల్గొన్నారు.










