Jun 20,2022 23:28

బీమా చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాష

ప్రజాశక్తి-కలెక్టరేట్‌
స్పందనలో పలుమార్లు అర్జీలు ఇస్తూ అలసిపోకుండా తిరుగుతున్న మొవ్వ మండలం కూచిపూడి నివాసి వెలగం శివ పార్వతి సమస్యను సానుభూతితో విని మానవత్వంతో తక్షణమే పరిష్కరించిన కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఇటు అధికారులు అటు బాధితురాలి మన్నలను పొందారు. కూచిపూడిలో నివసించే శివపార్వతి తన భర్త ప్రసాద్‌ , ఇద్దరి పిల్లలతో నివసిస్తూ ఉంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. వైఎస్సార్‌ బీమా పథకం కింద రెండు లక్షల' రూపాయిలు ఆమె పేరిట బ్యాంకు ఖాతాలో జమ కావాల్సివుంది. అయితే ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆమెకు బీమా సొమ్ము దక్కలేదు. నగదు మొత్తాన్ని నాలుగు సార్లుగా ఆమె ఖాతాలో డిపాజిట్‌ చేస్తున్నప్పటికీ జన్‌దన్‌ బీమా ఖాతా అయినందున ఆ మొత్తం వెనక్కి తిరిగివస్తున్నట్లు గుర్తించారు. సమస్యను గుర్తించిన కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆ రెండు లక్షల రూపాయలను చెక్‌ రూపంలో చెల్లించమని సెర్ప్‌ సిఇఓను కోరారు. దీంతో సోమవారం స్పందన మీటింగ్‌ హాల్లో వెలగం శివ పార్వతికి కలెక్టర్‌ చెక్కును అందజేశారు.