వైద్యశాలలో సదుపాయాలు కల్పన
ప్రజాశక్తి-అల్లూరు : ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అమరా బొచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిమటాలజీ ఎనలైజర్ పరికరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త పరీక్షల నమూనాకు ఈ ప్రాంత వాసులు నెల్లూరు, కావలి వెళ్లాల్సిన అవసరం లేదని కేవలం 2, 3 నిమిషాలలో ఫలితాలు పొందవచ్చని వివరించారు. బొచ్చు కృష్ణకుమార్, బొచ్చు సంధ్య కృష్ణలు రూ.2 లక్షల 70వేలతో ఈ పరికరాన్ని అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన వైద్యులు లేక వెలవెల బోయిందని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటినుండి వైద్యులని ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గైనకాలజిస్టుల ద్వారా నెలకి 20 ఆపరేషన్లు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రూ.7 కోట్లతో అదనపు బిల్డింగు ఏర్పాటు చేశామన్నారు. అలాగే కేన్సర్ వ్యాధిగ్రస్తులకు త్వరలో కావలి ఏరియా వైద్యశాలకు రూ.50 లక్షలు వెచ్చించి అన్ని పరికరాలు ఏర్పాటుకు ముందుకు వచ్చారని తెలియజేశారు. పుణ్యక్షేత్రమైన కొండ బిట్రగుంటకు రూ.70 లక్షల వ్యయంతో అడ్మిన్ బిల్డింగు ఏర్పాటుకు శిలాఫలకం వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సివిల్ సర్జన్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీరామకృష్ణ, ఎంపిడిఒ శ్రీదేవి, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి సామంతల సురేష్‌రెడ్డి, ఎంపిపి దర్శిగుంట శశిరేఖ, మండల ఉపాధ్యక్షులు గుమ్మడి సురేంద్ర యాదవ్, కోడూరు సాధక్ కుమార్ రెడ్డి, నార్త్ ఆములూరు సర్పంచ్ షేక్ కరిముల్లా షాఖాదర్ తదితరులున్నారు.










