Feb 14,2022 09:27
  • కౌన్సిలింగ్‌కు ముందే కొందరికి స్థానచలనం
  • ఐదేళ్లయినా ఉన్నచోటు వీడేందుకు సీనియర్లు ససేమిరా
  • భారీగా చేతులు మారుతున్న డబ్బులు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఐదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గనిర్దేశకాల్లో స్పష్టంగా నిర్దేశించింది. అయితే ఈ నిబంధన కిందిస్థాయిలో అమలవుతున్న ప్పటికీ, ఉన్నతస్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా వైద్య విద్య డైరెక్టరేట్‌ (డిఎంఇ) పరిధిలోని మెడికల్‌ కాలేజీలు, బోధనాసుపత్రులతోపాటు ఎపి వైద్య విధాన పరిషత్‌ (ఎపివివిపి) పరిధిలోని జిల్లా ఆసుపత్రులలో ఒకేచోట ఐదేళ్ల పాటు పని చేసి, బదిలీకి అర్హులైన వారి వివరాలను ఎక్కడా ప్రదర్శించలేదు. రాజకీయ పెద్దల సిఫార్సులు కూడా బలంగా పనిచేస్తున్నట్లు సమాచారం. మరికొందరు అయితే బదిలీల కౌన్సెలింగ్‌ ప్రారంభం కూడా కాకముందే తమకు కావాల్సిన చోటకు బదిలీ చేయించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం తొమ్మిది మంది ప్రొఫెసర్లను డిఎంఇ బదిలీ చేశారు. బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. డిఎంఇ కార్యాలయం కేంద్రంగానే ఈ వ్యవహారమంతా జరుగుతోందని వైద్యారోగ్యశాఖలో అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
 

                                        డిఎంఇ పరిధిలో బదిలీకి అర్హులు 1,300 మంది

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డిఎంఇ పరిధిలోని ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీలలో 1,300 మంది బదిలీకావాల్సి ఉంది. ఈ మేరకు సంబంధిత అధికారులు జాబితాలను కూడా రూపొందించారు. రాష్ట్రంలో 431 మంది ప్రొఫెసర్లు పని చేస్తుండగా, వారిలో ఒకే చోట ఐదేళ్లపైబడి పని చేస్తున్న వారు 250 మంది ఉండగా, వారంతా విధిగా బదిలీ కావాల్సి ఉంది. అలాగే 375 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లలో 190 మంది, 1,737 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో 800 మంది ఐదేళ్లపైబడి ఒకే చోట పని చేస్తున్నారు. ట్యూటర్లు 123 మంది ఉండగా, వారిలోనూ 70 మందిని బదిలీ చేయాల్సి ఉంది. ప్రజార్యోశాఖ డైరెక్టరేట్‌, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయాల పరిధిలో మాత్రమే క్లియర్‌ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, బదిలీల వల్ల ఏర్పడే ఖాళీలు, ప్రస్తుతం ఉన్న అధికారులు, ఉద్యోగులలో ఎవరెవరు ఎంతకాలం నుంచి ఒకే సెంటర్‌లో పని చేస్తున్నారు, వారిలో ఎవరెవరు బదిలీకానున్నారో స్పష్టంగా వెబ్‌సైట్‌లో ఉంచారు. డిఎంఇ, ఎపివివిపిలో మాత్రం ఎక్కడా అటువంటి జాబితాలో కనిపించకపోవడం గమనార్హం.