Jan 26,2022 09:56
  • 8 శాతం కేటాయించాలన్న నీతి అయోగ్‌
  • రూ.20 వేల కోట్లు అవసరమని అంచనా

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కోవిడ్‌ కొత్త వేరియంట్లు డెల్టా, ఒమిక్రాన్‌ వైరస్‌తోపాటు ఆర్థిక కష్టాలు వెంటాడుతోన్న నేపథ్యంలో 2022-23 బడ్జెట్‌ అంచనాలను రూపొందిస్తున్న ప్రభుత్వానికి వైద్యారోగ్య సంక్షేమానికి నిధుల కేటాయింపు సవాల్‌గా మారింది. నీతి అయోగ్‌ సిఫార్సు మేరకు వార్షిక బడ్జెట్‌లో ఎనిమిది శాతాన్ని వైద్యారోగ్యశాఖకు కేటాయించాల్సి ఉంది. రెండేళ్లుగా ఈ సిఫార్సులు అమలుకావడం లేదు. వైద్యారోగ్యశాఖకు 2020-21లో రూ.11,419.48 కోట్లు (5.08 శాతం) నిధులను కేటాయించగా, 2021-22లో రూ.13,830.34 కోట్లను (5.82 శాతం) కేటాయించారు. మునుపటి ఏడాదికంటే ఇది 21.11 శాతం అధికంగా ఉన్నప్పటికీ, నీతి అయోగ్‌ సిఫార్సులకు తగ్గట్టుగా లేదు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులపై వైద్యారోగ్య సంక్షేమశాఖ కసరత్తు పూర్తయింది. నీతి అయోగ్‌ సిఫార్సుల మేరకు 8 శాతం అంటే సుమారు రూ.20 వేల కోట్లను కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అధికారులు కూడా ఆ దిశగా ప్రతిపాదనలను ఆర్థికశాఖకు అందజేసినట్లు సమాచారం. కోవిడ్‌ మూడో దశను దృష్టిలో పెట్టుకుని అత్యవసర మందులతోపాటు వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ సౌకర్యాలను ప్రభుత్వం కొంతమేర అందుబాటులోకి తెచ్చింది. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలతోపాటు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయినా, నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ టెస్టులు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు వైద్యం కోసం ఇంకా డోలీ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు. వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సిఎం వైఎస్‌ జగన్‌ పదే పదే చెబుతున్న తరుణంలో బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలను భారీగా ఇవ్వొద్దని ఇప్పటికే ఆర్థికశాఖ నుంచి సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో వేచి చూడాల్సిందే.

11