ప్రజాశక్తి-హిందూపురం : రానున్న మరో మూడు...నాలుగు నెలల్లో వైద్య విధానంలో రాష్ట్రంలో భారీ మార్పులు వస్తాయని జిల్లా కలెక్టర్ బసంత్‌కుమార్ పేర్కొన్నారు. దాదాపు 15నెలల అనంతరం జిల్లా అసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా 30 అంశాలతో కూడిన అజెండాను మెడికల్ సుపరింటెండెంట్ రోహిల్‌కుమార్ ప్రవేశ పెట్టారు. దీనిపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు అమరాపురంలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామని చెప్పారు. ఒక డ్రిల్లింగ్ మిషన్ ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్లో వస్తున్న నిధుల్లో కానీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లోకానీ మొదటి ప్రాధాన్యత కింద డ్రిల్లింగ్ మిషన్ కొనాలని నిర్ణయించామన్నారు. వచ్చే అభివద్ధి కమిటీ సమావేశానికి ముందుగానే ఆసుపత్రిలో అవసరమైన ప్రతిపాదనలకు బడ్జెట్ ఎంత ఉంది అనేది చూసుకుని ప్రతిపాదనలు పూర్తిగా సిద్ధం చేయాలన్నారు. ఆస్పత్రిలో వీలైనంత తొందరగా సిటీ స్కానింగ్ సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కృష్ణారెడ్డి, డిసిహెచ్ తిప్పేంద్రనాయక్, అభివృద్ది కమిటీ మెంబర్లు గంగిరెడ్డి, ఐఎంఎ మెంబర్ డాక్టర్ వెంకటరమణ, ఎసిపి ఆనంద్‌కుమార్, ధనలక్ష్మి, డాక్టర్ శివకుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.










