Dec 27,2021 08:30
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి అందని సహకారం
  • 2021-22లో రూ.1,238 కోట్లు విడుదల
  • కోవిడ్‌ వల్ల 8 నెలల్లోనే ఖర్చు
  • ఏప్రిల్‌ వరకు నిరీక్షించాల్సిందే


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి కేంద్రం నుంచి చెప్పుకోదగిన సహకారం అందడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నిధులను కేటాయించడంలో కేంద్రం సాచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. ఏటా కేటాయింపులను పెంచుతున్నా, అది నామమాత్రంగానే ఉంటోంది. వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద నిధులను పెంచాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నా, పట్టించుకోకపోవడం గమనార్హం. రాష్ట్రాల బడ్జెట్లలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు కనీసం ఎనిమిది శాతం నిధులు కేటాయించాలని నీతి అయోగ్‌ సిఫార్సు చేయగా, కేంద్రం నుంచి సహకారలేమితో ఆరున్నరశాతానికి మించి నిధులు కేటాయించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి), ఏరియా ఆస్పత్రులతోపాటు అధునాతన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం), జాతీయ పట్టణ ఆరోగ్య పథకం (ఎన్‌యుహెచ్‌ఎం) కింద కేంద్రం నిధులు కేటాయిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పథకాల కింద రూ.1,238 కోట్లను (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం రూ.1,175.66 కోట్లు, ఎన్‌యుహెచ్‌ఎం రూ.62.29 కోట్లు) కేంద్రం విడుదల చేయగా, నవంబరు నాటికి రూ.775.19 కోట్లు (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం రూ.747.40 కోట్లు, ఎన్‌యుహెచ్‌ఎం రూ.49.29 కోట్లు) ఖర్చయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని రకాల ఆస్పత్రుల్లో అధునాతన వైద్య సౌకర్యాలు, పరికరాలు, బెడ్‌లు, వెంటిలేటర్స్‌ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,216 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం కేటాయించిన నిధులను ఎనిమిది నెలల్లోనే ఖర్చు చేయడంతో, మిగిలిన నాలుగు నెలలకు అవసరమైన నిధుల కోసం వచ్చే బడ్జెట్‌ వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కేటాయింపులతో పోల్చితే ఈ ఏడాది నిధుల పెంపు స్వల్పంగానే ఉంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంపై ఎక్కువగా ఉంది. కోవిడ్‌ పేషెంట్స్‌కు వైద్య సేవలు అందించడంతోపాటు వారికి పౌష్టికాహారం సరఫరా చేయడంతో రాష్ట్రంపై అదనపు భారం పడింది. దీంతో కేంద్రం కేటాయించిన నిధులను తక్కువ సమయంలోనే ఖర్చు చేయాల్సి వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఎన్‌యుహెచ్‌ఎం కింద కేంద్రం కేటాయించే నిధులను రాష్ట్ర అధికారులు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖకు ప్రతిపాద నలు పంపించినప్పటికీ ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది.

111