Feb 07,2023 20:55

వైద్య కళాశాల పనులు త్వరగా ప్రారంభించాలి : సిపిఎం

మదనపల్లె అర్బన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకంగా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాల పనులు త్వరగా ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి నాయకులు ఎన్‌.చంద్రతో కలిసి వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పరిశీలించి అధికారులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ వైద్య కళాశాలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణకు పొంతన లేదన్నారు. 2024 జూన్‌కు వైద్య కళాశాల తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, పునాది రాయి కూడా వేయలేకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. నాబార్డ్‌ నుండి అనుమతి, ప్రభుత్వ అనుమతులు, టెండర్ల పూర్తయినా పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ పనులు ప్రారంభించకపోవడం నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదన్నారు. తగినన్ని యంత్రాలను, సిబ్బందిని నియమించి త్వరితగతిన పనులు ప్రారంభించాల్సి ఉన్న కాంట్రాక్ట్‌ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మదనపల్లి, తంబళ్ళపల్లి, పీలేరు నియోజకవర్గాలే కాకుండా కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా మదనపల్లికు వైద్య సేవలు కోసం వస్తున్నటువంటి ప్రజలకి వైద్య సేవలు అందుబాటులోకి రావడం కోసం మెడికల్‌ కాలేజీ ఎంతో ఉపయోగపడుతుందని, ఇంత ప్రాముఖ్యత ఉన్న మెడికల్‌ కాలేజీ పనులు ప్రారంభం కావడానికి ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజా సంఘాలను, ప్రజలను కూడగట్టి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
- వైద్య కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన నాయకులు