Feb 22,2022 10:11
  • విద్యార్హతల్లో ఒక్కొక్కరిది ఒక్కో తీరు
  • శ్రీకాకుళం, తిరుపతిలో ఎంపిఇడి, విజయవాడ, అనంతపురంలో బిపిఇడి విద్యార్హత
  • అధిక విద్యార్హతలను పక్కనపెట్టిన విజయవాడ డెంటల్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైద్య, దంత కళాశాలల్లో కాంట్రాక్టు విధానంలో ఫిజికల్‌ డైరెక్టరు (పిడి) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లు వివాదాస్పదంగా మారాయి. ఒక్కో కాలేజీ ఒక్కో విద్యార్హతను ప్రకటించడమే ఇందుకు కారణం. రూ.50 వేలు వేతనం చెల్లించే పోస్టుల నోటిఫికేషన్‌లలో తేడాలుండటంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పోస్టుకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా, ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టులో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ను చూపించడం సర్వసాధారణం. ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో అందుకు భిన్నంగా ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఉండటం గమనార్హం. విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల, అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీ (స్విమ్స్‌), శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు విధానంలో ఫిజికల్‌ డైరెక్టరు పోస్టుల భర్తీకి డిసెంబరు 1న నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందుకోసం యుజిబిపిఇడి, బిపిఇడి, ఎంపిఇడి, ఎంఫిల్‌, పిహెచ్‌డి విద్యార్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయా కాలేజీలు ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును విడుదల చేశాయి. వాటిపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని నోటిఫికేషన్‌ కూడా ఇచ్చాయి. అప్పటికిగానీ ఒక్కో కాలేజీ ఒక్కో విద్యార్హతను ప్రకటించినట్లు అభ్యర్థులకు తెలియలేదు. తిరుపతి స్విమ్స్‌, శ్రీకాకుళం మెడికల్‌ కాలేజీల నోటిఫికేషన్‌లో ఎంపిఇడి విద్యార్హత ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొనగా, విజయవాడ డెంటల్‌, అనంతపురం మెడికల్‌ కాలేజీలు మాత్రం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, డిప్లమో ఉండాలని పేర్కొనడం గమనార్హం. శ్రీకాకుళం, అనంతపురం, తిరుపతి కాలేజీల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టులో అభ్యర్థుల హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ను లిస్టులో ప్రకటించగా, విజయవాడ డెంటల్‌ కాలేజీ అధికారులు మాత్రం కేవలం బిపిఇడిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. నిబంధనలతోపాటు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకోకపోగా, అభ్యంతరాలను కూడా పట్టించుకోవడం లేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
 

                                                    జెసిని తప్పుదోవ పట్టించిన అధికారులు !

విజయవాడ గవర్నమెంటు డెంటల్‌ కాలేజీ అధికారులు సెలెక్షన్‌ కమిటీ సభ్యులుగా ఉన్న జాయింట్‌ కలెక్టరు (వి అండ్‌ డబ్ల్యుఎస్‌, అభివృద్ధి) ఎల్‌ శివశంకర్‌నుసైతం తప్పుదోవ పట్టించారు. జిల్లా ఎంపికల కమిటీలో (డిఎస్‌సి) సభ్యులుగా ఉన్న జెసికి విద్యార్హతలపై పలువురు ఫిర్యాదు చేశారు. తొలుత ఆయన కూడా డెంటల్‌ కాలేజీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారమే ఎంపిక చేస్తామని చెప్పగా, అభ్యర్థులు తిరుపతి, శ్రీకాకుళం కాలేజీలు చేపట్టిన విధానం, అక్కడి మెరిట్‌ లిస్టును ఆయనకు చూపించారు. దీంతో నోటిఫికేషన్‌లో విద్యార్హతలను పేర్కొనడంలో తప్పిదం జరిగిందనే విషయాన్ని గుర్తించారు. అభ్యర్థులు దీనిపై సోమవారం స్పందనలోనూ ఫిర్యాదు చేశారు.