Jan 05,2023 22:16

తాజ్‌బాబాకు జ్ఞాపికను అందజేస్తున్న ప్రముఖులు

ప్రజాశక్తి -పెనుకొండ : మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన బాబయ్య స్వామి దర్గా 750 వ గంధం వేడుకలు గురువారం కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించి వంశపారంపర్య దర్గా పీఠాధిపతి తాజ్‌ బాబా ఆధ్వర్యంలో గంధంను దర్గాకు కాబోయే వంశపారంపర్య పీఠాధిపతి సలావుద్దీన్‌ బాబా తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా దర్గా లో బాబయ్య సమాధి వద్ద గంధం ను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత పెద్దలు, బాబయ్య స్వామి భక్తులు తాజ్‌ బాబా శిష్య బృంద సభ్యులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెనుకొండ డిఎస్‌పి హుస్సేన్‌ పీరా ఆధ్వర్యంలో సిఐలు, ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పెనుకొండలో మతసామరస్యం
మత సమరస్యానికి ప్రతీకగా నిలిచిన పెనుకొండ ప్రాంతంలో మతసామరస్యం వెల్లువిరుస్తూనే ఉంటుందని బాబయ్య స్వామి దర్గా వంశపారంపర్య పీఠాధిపతి తాజ్‌ బాబా పేర్కొన్నారు. బుధవారం రాత్రి స్థానిక సందల్‌ మహల్‌ వద్ద గల ఆవరణంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సర్వమత సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డ్స్‌ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాజ్‌ బాబా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలన్నారు. 50 మంది ప్రముఖులకు పెనుకొండ దర్గా నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డ్స్‌ ను ఈ అవార్డులను ముస్లిం నగారా జాతీయ అధ్యక్షులు ఉమర్‌ ఫారూఖ్‌ ఖాన్‌, శ్రీ సత్యసాయి జిల్లారచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్‌ బాషా నేతత్వంలో తాజ్‌ బాబా, పెనుకొండ డి ఎస్‌ పి హుస్సేన్‌ పీరా చేతులు మీదుగా ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూల్‌ కు చెందిన సాయి సంస్థాన్‌ పీఠాధిపతి శివ సాయి గురుజీ, కర్నాటకకు చెందిన శివ మృత్యుంజయ స్వామీజీ, బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం డాక్టర్‌ హేమలత సిస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.