వాటర్‌ప్లాంట్ ప్రారంభం
ప్రజాశక్తి-వింజమూరు : మండలంలోని ఊటుకూరు గ్రామం ఇందిరా నగర్ కాలనీలో వి.పి.ఆర్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదివారం మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి.పి.ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఊటుకూరు పంచాయతీ, ఇందిరా నగర్ ఎస్.టి .కాలనీకి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఊటుకూరు పంచాయతీ చాలా మోడల్ పంచాయతీ అని విన్నాననీ, ముఖ్యంగా 7 మంది ట్రైనీ కలెక్టర్‌లకు ఆతిథ్యం ఇచ్చి వారి శిక్షణలో భాగస్థులవ్వడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. దీనికి గానూ పంచాయతీ సర్పంచ్ దొడ్డా వెంగమ్మకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్న మెట్ట ప్రాంతాలంటే ప్రత్యేకమైన అభిమానమన్నారు. ఈ ప్రాంతానికి ఎదోక రూపంలో సహాయపడాలనేదే తన సంకల్పమన్నారు. అందుకోసమే తాను వి.పి.ఆర్. ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తే బాగుంటుందని వి.పి.ఆర్ అమృతధారను ప్రారంభించానని తెలిపారు. 2017వ సంవత్సరం నుంచి మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 103 ప్లాంట్లకుపైగా ప్రారంభించామన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్‌కు సంబంధించి నిరంతరంగా ఏ సమస్య వచ్చినా, వెంటనే తగు చర్యలు తీసుకొని సజావుగా నడిచే విధంగా సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు గానూ 24 ప్లాంట్లను ఇది వరకు ప్రారంభించి ప్రజల దాహార్తిని తీరుస్తూ ముంధుకు వెళ్తున్నామన్నారు. వింజమూరు మండలంలో ఇది 4వ మినరల్ వాటర్ ప్లాంట్ అని, ఈ ప్లాంట్‌ను కూడా జాగ్రతగా ఉపయోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా గ్రామస్తులు సింగిల్ ఫేస్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, కమ్యూనిటీ హాల్ కోరిక విన్నవించగా తక్షణమే స్పందించి ఏర్పాటు చేయిస్తామని, ఇతర ముఖ్యమైన అవసరమైన పనులు ఏమైనా తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, సర్పంచ్ ఆర్.వెంగమ్మ, మాజీ ఎంపిటిసి ఆర్.కొండయ్య, ఎపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










