Dec 07,2022 21:40

హిందూపురం 43వ సచివాలయంలో సెక్రటరీలు లేక ఖాళీగా ఉన్న కూర్చీలు

        హిందూపురం : పరిపాలనను గ్రామ, వార్డు స్థాయిలో విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి విభాగానికీ ఒక సెక్రటరీని నియమించింది. అయితే ఆయా సచివాయాల్లో విధులు నిర్వహించే సెక్రటరీలు మాత్రం విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయాన్నే కార్యాలయానికి రావాడం హాజరు పుస్తకంలో సంతకం పెట్టడం... అతర్వాత మూమెంట్‌ రిజిస్టర్‌లో క్షేత్రపరిశీల అంటు రాయడం అటునుంచే ఇళ్లకు వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. క్షేత్ర స్థాయికి ఎందుకు వెళ్లారు..? ఏమి పరిశీలించారు.? ఇలాంటి వివరాలేవీ రిజిస్టర్‌లో రాయరు. ఎవరైనా అడిగినా చెప్పరు. ఉన్నతాదికారులు సైతం ఈ విషయాలను గుర్తించలేవడం గమనార్హం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయాలు 896, గ్రామ వాలంటీర్లు 15,995, పంచాయతీ గ్రేడ్‌-5, కార్యదర్శులు 571 గ్రేడ్‌ -6 డిజిటల్‌ సహాయకులు 896 మహిళా పోలీసులు, వీఆర్వోలు, ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఉద్యానవన, సర్వేయర్లు కలిపి దాదాపు 5,000 మంది వరకు ఉన్నారు. సచివాలయాల ద్వారా అందించాల్సిన సేవలు 540 ఉంటే ప్రస్తుతం అందుతున్న సేవలు కేవలం 50 లోపు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక నగర పాలక సంఘంతో పాటు 11 పురపాలక సంఘాల్లో వార్డు సచివాయాలు 311 ఉన్నాయి. ప్రతి సచివాలయంలో ప్రతి విభాగానికి ఒకరు వార్డు సెక్రటరీతో పాటు వార్డు వాలంటీర్లు ఉన్నారు. చాలా సచివాలయాల్లో సిబ్బంది వచ్చి సంతకం పెట్టి తరువాత కన్పించకుండా పోతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. క్షేత్ర స్థాయి పరిశీలనలో ఎక్కడైనా కన్పిస్తారా అంటే అదీకూడా లేని పరిస్థితి ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా 540 రకాల సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ధేశించింది. అందులో సగం కూడా ప్రజలకు సచివాలయాల ద్వారా అందలేదు. ఇప్పటికీ కులం, ఆదాయం, మరణ, జనన వంటి ధ్రువీకరణ పత్రాలకు తహశీల్దారు కార్యాలయాలకే వెళ్లాల్సి వస్తోంది. సచివాలయంలో కేవలం డిజిటల్‌, అడ్మిన్‌ సెక్రటరీలు మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని ఎవరిని అడిగి క్షేత్ర స్థాయి పరిశీలన అనే సమాధానం వస్తుంది. ప్రజలకు అవసరమైన సేవలన్నింటినీ వార్డు, గ్రామంలోనే అందించాలనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది.
సచివాలయ వ్యవస్థ తీరు హిందూపురంలో....
సచివాలయ తనఖీకి వచ్చే అధికారులు ముందస్తు సమచారం ఇస్తుండడతో ఖచ్ఛితంగా సిబ్బంది అంతా కనిపిస్తారు. పురపాలక సంఘం కార్యాలయానికి పక్కనే ఉన్న భవనంలో రెండు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో ఏ సమయానికి వెళ్లినా పూర్తి స్థాయిలో కార్యదర్శులు కన్పించరు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రతి కార్యదర్శి అందుబాటులో ఉండి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలనే నిబంధనలు ఉన్నా పాటించడం లేదు. మున్సిపల్‌ కార్యాలయం పక్కన ఉన్న సచివాలయం పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వాటి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ముదిరెడ్డిపల్లిలో ఉన్న 36, 37, 38వ వార్డు సచివాలయాలు, మోత్కుపల్లి, మోడల్‌ కాలనీ, కొట్నూరు తదితర శివారు ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల సిబ్బంది పనితీరు పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా పోలీసులు అయితే వారు ఏ విధులు నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. పారిశుధ్యం, ప్లానింగ్‌, వెల్‌ఫేర్‌ ఇలా అన్ని శాఖల పరిధిలోనూ సమస్యలు పురంలో కన్పిస్తున్నాయి. కొన్ని మున్సిపాల్టీల్లో అయితే కొత్త పింఛన్‌ మంజూరు అయినా, పథకాలు ఏవైనా వచ్చినా సిబ్బంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం
మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు

హిందూపురం పురపాలక సంఘం వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి నోటీసులు ఇచ్చాం. కొంత మంది అధికారులను సచివాలయలకు పర్యేవేక్షణ అధికారులుగా నియమించాం. ఇకపై సచివాలయాలను ఆకస్మిక తనఖీలు నిర్వహిస్తాం. అందుబాటులో లేని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.