ప్రజాశక్తి రాయచోటి: వచ్చే వారంలోగా కల్లా ఎత్తిపోతల (లిఫ్ట్ స్కిం) పథకానికి సంబందించి భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని సంబంధితాధికారులను కలెక్టర్ గిరీషా పిఎస్ ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎత్తిపోతల పథకం, ముదివేడు బ్యాలెన్స్ రిజర్వాయర్, తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ఆగస్టులో కురిసే వర్షాలకు శ్రీనివాస్ రిజర్వాయర్ నీటితో నింపుదామని, ఆలోగా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. శ్రీనివాస్ రిజర్వాయర్ పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నాయా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఝరికోన ప్రాజెక్ట్ సంబంధించి భూ సేకరణలో భాగంగా శెట్టిపల్లి, దేవపట్ల గ్రామాలలో ల్యాండ్ అక్వేషన్స్ పూర్తి కావాలని ఆర్‌డిఒను ఆదేశించారు. అన్ని ఎత్తిపోతల పథకాలకు సంబంధించి వచ్చేవారంలోగా ఫైనల్ ఆర్‌అండ్‌ఆర్ పూర్తి కావాలన్నారు. లక్కిరెడ్డిపల్లి లిఫ్ట్ స్కీమ్ సంబంధించి ఫారం సి, ఆర్‌అండ్‌ఆర్ పూర్తి చేయాలన్నారు. ఈనెల ఆఖరిలోగా రెవెన్యూ పరంగా భూసేకరణ పనులన్నీ పూర్తి చేసి అప్లోడ్ చేయాలన్నారు. ముదివీడు బ్యాలెన్స్ రిజర్వాయర్ సంబంధించి కురబలకోటలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. జిఎన్‌ఎస్‌ఎస్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ల్యాండ్ అక్వేషన్స్ ఎన్ని గ్రామాలు చేశారు, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అడిగి తెలుసుకున్నారు. రాబోవు వర్షాకాలంలో పింఛ ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచేందుకు రిటర్నింగ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టులో పనులు పురోగతిపై తెలియజేయాలన్నారు. అన్నమయ్య డ్యామ్ సంబంధించిన ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి కిరణ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ జయరాజ్, ఇరిగేషన్ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.










