నటి, మోడల్ అయిన నివేదా థామస్ ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. మలయాళ చిత్రం ''వెరుథె ఒరు'' సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువనటి పురస్కారం అందుకుంది. తెలుగులో మొదటి సినిమా ''జెంటిల్ మేన్''లోనూ తన నటనతో ప్రశంసలు అందుకుంది నివేదా. 2002లో మలయాళ చిత్రం ''ఉత్తర''తో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. ప్రస్తుతం ఆమె నటించిన ''వకీల్ సాబ్'' చిత్రం ప్రేక్షక ఆదరణ పొంది, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు..
పేరు : నివేదా థామస్
పుట్టిన తేదీ: 1995, నవంబర్ 2
పుట్టిన ప్రాంతం : కన్ననూర్, కేరళ
చదువు: బీటెక్-ఆర్కిటెక్చర్
హాబీస్ : మ్యూజిక్
నివాస ప్రాంతం: చెన్నరు
తల్లిదండ్రులు: థామస్, లిల్లీ
సోదరుడు : నికిల్ థామస్
'వకీల్ సాబ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మన కోసం చేసిన సినిమా అనుకునే విధంగా సన్నివేశాలు ఉంటాయి. హిందీ హిట్ చిత్రం 'పింక్' రీమేక్‌గా తెరకెక్కించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలా చేసిన మా ప్రయత్నం విజయం సాధించింది. అయితే సినిమా ప్రచారం సమయానికే నేను కరోనా బారిన పడ్డాను. దీంతో ప్రచారానికి వెళ్లలేకపోయాను. ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని బాధపడ్డాను. ప్రస్తుతం మహమ్మారి నుంచి కోలుకున్నా, మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
నేనూ సమస్యల్ని ఎదుర్కొన్నాను..
చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవాళ సమాజంలో వాస్తవ ఘటనలకు చాలా దగ్గరగా ఉంటుందీ సినిమా. ఎందుకంటే నేనూ సగటు మహిళలకి ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ పాత్ర గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మనసు పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ పాత్రను పర్సనల్‌గా తీసుకోలేదు. అయితే ఎలా నటిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో నేనూ అంజలి, అనన్య చర్చించుకునేవాళ్లం. వాళ్లతో కలిసి నటించడం కొత్త అనుభూతినిచ్చింది.
కరోనా రావడం బాధ అనిపించింది
కరెక్ట్‌గా ప్రమోషన్ టైమ్‌లో నాకు కోవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. అయితే రైట్ టైమ్‌కు నాకు మళ్లీ నెగిటివ్ వచ్చింది. థియేటర్‌కు వెళ్లి, సినిమా చూద్దామని అనుకున్నాను. ఆరోగ్యంగా ఉండేందుకు బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.
ఆ క్రెడిట్ వాళ్లదే..
''కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే నేను థియేటర్‌కు వెళ్లి 'వకీల్‌సాబ్' చూశాను. థియేటర్‌లో ప్రేక్షకుల సందడి మాటల్లో చెప్పలేను. నా జీవితంలో అది ఓ అందమైన రోజుగా చెప్పుకుంటా. ఆరోజు ఎప్పటికీ మర్చిపోను''. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌తో పాటు మిగతా ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్ల గురించి పూర్తిగా తెలుసు. దర్శకుడి శ్రీరామ్ వేణు మీద నమ్మకంతోనే సినిమా చేశాను. ఈ సినిమాకు థమన్ ఇచ్చిన ఔట్‌పుట్ మరే సంగీత దర్శకుడూ ఇవ్వలేరని నా అభిప్రాయం. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా కంటే పవర్ స్టార్ అభిమానిగా పనిచేశాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ క్రెడిట్ వాళ్లదే.
కోవిడ్.. సాధారణం కాదు !
'కోవిడ్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కరోనా ఉంది. ఎవరి నుంచైనా కరోనా రావచ్చు. జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన కరోనా రావడానికి ఛాన్స్ లేదు అని చెప్పలేం. కరోనా అంటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం కాదు. ఎందుకంటే, దీనివల్ల మన రోగనిరోధక శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ ''వకీల్ సాబ్'' సినిమాను థియేటర్లో చూడండి. మాస్క్, శానిటైజ్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుతున్నాను'.
''వకీల్ సాబ్''తో ఆలోచన మొదలవుతుంది !
సినిమాలు చూసి రాత్రికి రాత్రి ఎవరి స్వభావాలూ మారిపోవు. కానీ ఒక ఆలోచన మాత్రం ఎక్కడో మొదలవుతుంది. ఇవాళ ఈ సినిమా వల్ల ఒక చర్చ స్టార్ట్ అయ్యింది. మహిళల గురించి మనకు నచ్చిన ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదని, వారిని మనకు తోచిన ఉద్దేశంతో చూడటం సరికాదనే ఆలోచనలు మొదలయ్యాయి. వాళ్ల గురించి మనం జడ్జ్‌మెంట్ పాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్లు చెప్పేది మీకు నచ్చకున్నా, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వాలనేది ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.
పవన్ చాలా సైలెంట్ పర్సన్ !
పవన్ కల్యాణ్‌తో కలిసి నటించడం ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. సెట్‌లో మా మధ్య ఎప్పుడూ సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి, సీన్స్ గురించి చర్చ జరుగుతుండేది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్ సందర్భంగా ఎలా టైమింగ్‌లో చేయాలి అనేది మాట్లాడుకునే వాళ్లం. ఆయన చాలా నైస్, సైలెంట్ పర్సన్. థాట్‌ఫుల్‌గా, కామ్‌గా ఉండేవారు. భాష మీద పవన్‌కి ఉన్న పట్టు ఆశ్చర్యాన్ని కలిగించేది. పవన్ సార్ ఫ్యాన్‌గా దిల్‌రాజు ఈ సినిమా చేశారు. ఆయన డ్రీమ్ ఫిల్మ్ ఇంత పెద్ద సక్సెస్ అవడం సంతోషంగా ఉంది.
అప్ కమింగ్ ప్రాజెక్టులు
ప్రస్తుతం 'మిడ్‌నైట్ రన్నర్స్' అనే కొరియన్ రీమేక్‌లో నటిస్తున్నాను. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రెజీనా మరో కథానాయిక.. అంటూ నివేదా చెప్పుకొచ్చారు.