Nov 01,2021 08:58

మిట్టపేట చిన్న గ్రామం. దీపావళి వచ్చిందంటే టపాకాయలు కొనడానికి పక్క గ్రామానికి వెళ్లాలి. ఆ టపాకాయల అంగట్లో ఎవరువెళ్లినా ఒకే ధరకే అమ్ముతారని అందరికీ తెలుసు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలనే పంపి తీసుకోమని చెప్పేవారు. ఐదో తరగతి చదువుతున్న ఐదుగురు బాలురు దీపావళి రోజు తమ సైకిళ్లు తొక్కుకుంటూ మిట్టపేట నుంచి ప్రక్క గ్రామానికి వెళ్లారు.
తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో తమకు కావాల్సిన టపాసులు కొన్నారు. ఇంటికి వెళ్లగానే కాల్చాలి అనుకొంటూ సంతోషంతో ఐదుగురూ సైకిళ్ల మీద ఇంటిదారి పట్టారు. ఉన్నట్లుండి మబ్బులు దట్టంగా పట్టి, మెల్లగా వర్షం కురవసాగింది. టపాసులు తడిసిపోతాయనే భయంతో ఐదుగురు దారిలో పాడుబడి ఉన్న భవనం బయట సైకిళ్లు ఆపి, టపాసుల సంచితో లోపలకు పరుగుతీశారు. లోపల ఒక బిచ్చగాడు కొడుకుతో సహా వీరిలాగే తలదాచుకుని ఉన్నాడు. అందరి సంచుల్లో టపాసులు ఉండటం గమనించిన బిచ్చగాడు 'మా దగ్గర టపాసులు కొనడానికి డబ్బుల్లేవు. కొన్ని ఇచ్చారంటే మీ వయసులో ఉన్న మా అబ్బాయి సంతోషంగా కాలుస్తాడు' అని అడిగాడు. ఐదుగురూ ఇవ్వబోమన్నట్టుగా అడ్డంగా తలాడించారు. 'మీకు టపాసులు కాల్చడమే ముఖ్యం. మీ తోటిపిల్లవాడి బాధ అర్థంకావడం లేదు. మిమ్మల్ని అడగడమే నా పొరపాటు' అన్నాడు బిచ్చగాడు.
వర్షం ఏకధాటిగా కురుస్తోంది. 'ఈ వర్షానికి తెలివిలేదు, మా నాన్నతో చెప్పి, దీనిపై కేసు పెట్టమంటాను' అన్నాడు వకీలు కొడుకు. 'మా నాన్నతో చెప్పి, ఈ వర్షాన్ని అరెస్ట్‌ చేయమంటాను' అన్నాడు పోలీసు కొడుకు. 'మా నాన్నతో చెప్పి, వర్షానికి బెత్తంతో నాలుగు దెబ్బలు వేయమంటాను' అన్నాడు మాస్టారు కొడుకు. 'వర్షం మంచి అదును చూసి పడాలని మా నాన్న కోరుకున్నట్లే పడుతుంది!' అన్నాడు రైతు కొడుకు. తన సంచిలోని కొన్ని టపాసులు తీసి, బిచ్చగాడి చేతిలో పెట్టి 'ఈ వర్షం చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా నాన్న ఇప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాడు' అంటూ ఆ రైతు కొడుకు ఒక్కసారిగా వానలోకి వెళ్లాడు. 'వానలు కురవాలి వాన దేవుడా... వరి చేను పండాలి వాన దేవుడా' అంటూ గెంతులేస్తుంటే మిగతా పిల్లలంతా ఆశ్చర్యంతో చూడసాగారు.

ఓట్ర ప్రకాష్‌ రావు
97874 46026