ప్రజాశక్తి-హిందూపురం : వామపక్షాలతోనే రాజకీయ చైతన్యం వస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ అన్నారు. బుధవారం పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాలులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలపై ఏ ఒక్కరు సైతం నోరు మెదపడం లేదన్నారు. కనీసం శాసన మండలిలో నైనా ప్రజల వాణిని వినపించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఉద్యమ నాయకులకు ఆదరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సిపిఐ నాయకులు బయన్న కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో దోపిడీని ప్రశ్నించాలన్న నిలదీయాలంటే ఉద్యమ నాయకులను చట్టసభలకు పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో దాదాపు 12వేలు బోగస్ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. ప్రజాసమస్యలపై శాసనమండలిలో నోరు విప్పాలంటే వామపక్షాలతోనే సాధ్యమన్నారు. ఉద్యమ నాయకులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష, విద్యార్థి సంఘ నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, జెడ్పీ శ్రీనివాసులు, కాటమయ్య, బాబావలి, చంద్రశేఖర్‌రెడ్డి, చలపతి, రామాంజినేయులు, మారుతీ శ్రీనివాస్, రమణ, బాబా, వివిధ వామపక్ష ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.










