ప్రజాశక్తి-నందిగామ : దేశమంతా ప్రశంసించేలా వాలంటరీ వ్యవస్థ పనితీరు వుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు , ఎంఎల్ఎ మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన వార్డు వాలంటీర్లకు సేవామిత్ర - సేవారత్న- సేవవజ్ర పురస్కారాలను బుధవారం కలెక్టర్ ఢిల్లీ రావు శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎంఎల్ఎ మాట్లాడుతూ సేవా భావంతో పనిచేస్తున్న వాలంటీర్ల ద్వారా దేశమంతా ఆంధ్ర ప్రదేశ్ వైపు చూసేలా గొప్ప వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని , వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవకులని , వారు చేస్తున్నది ఉద్యోగం కంటే గొప్ప సేవ అని , అలాంటి గొప్ప వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటయిందని , గ్రామ వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది పని చేస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వైయస్ జగన్ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు . ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కాలెండర్ ప్రకారం ఎవరికి ,ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెలియజేస్తూ, లబ్ధిదారులతో దగ్గరుండి దరఖాస్తు చేయించి , వారికి 33 ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా విప్లవాత్మక మార్పు తో సేవలందిస్తున్న వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరామ్ , వైస్ చైర్మన్లు మాడుగుల నాగరత్నం, ఓర్సు లక్ష్మి, నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు, కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు , మున్సిపల్ సిబ్బంది , సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .










