రాయచోటి టౌన్ : వాలంటీర్ల సేవలు అభినంద నీయమని కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్స్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మూడవ ఏడాది వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీష ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర మూడు కేటగిరీల్లో ప్రభుత్వం వరుసగా మూడవ ఏడాది అవార్డులుతో సత్కరిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వివక్ష ,ఆవినీతికి తావులేకుండా వాలంటీర్ల వ్యవస్థ పనిచేయాలని సూచించారు. గ్రామ, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందివ్వాలన్నారు. ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమలులో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ,పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు మంజూరులలో వాలంటీర్ల సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పురస్కారాలుతో వాలంటీర్లు స్ఫూర్తిగా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు వాలంటీర్లు
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు వాలంటీర్లని కలెక్టర్ గిరీష తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలును అర్హులందరికీ అందించి ప్రజలకు మరింత దగ్గర కావాలని వాలంటీర్లకు సూచించారు. సేవా వజ్ర, రత్న అవార్డులు రానివారు నిరూత్సాహ పడొద్దన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్‌సెల్‌లో ప్రస్తుతం అధికంగా భూ సమస్యలుపై అర్జీలు వస్తున్నాయని, గతంలో అయితే పెన్షన్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అండలేదని ఎక్కువగా ఫిర్యాదులు వచ్చేవని, సచివాలయ,వాలంటీర్ వ్యవస్థలు రావడంతో ఇప్పుడు ఈ ఫిర్యాదులు రావడం అతి తక్కువ అని, సాంకేతిక సమస్యల కారణంగా పథకాలు రానివారు వస్తుంటారని, అర్హత ఉంటే పథకాలును ప్రభుత్వమే లబ్ధిదారుల ఇళ్లకు అందిస్తోందన్నారు. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రదానం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కషి చేస్తున్నామన్నారు. ప్రజల చిరునవ్వులు, ఆశీర్వాదాలే మాకు కొండంత బలం. జగనన్న సైనికులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం అని వాలంటీర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ సత్యనారాయణ, జెడ్ పి డిప్యూటీ సి ఈ ఓ రమణా రెడ్డి, మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్,మైనారిటీ సీనియర్ నాయకులు అలీ నవాజ్, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, గౌస్ ఖాన్, అల్తాఫ్, జానం రవీంద్ర యాదవ్, కో ఆప్షన్ అయ్యవారు రెడ్డి,జిల్లా వక్ఫ్ బోర్డ్ సభ్యుడు నవరంగ్ నిస్సార్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు,మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, అజ్మతుల్లా ఖాన్, మున్సిపల్ ఆర్‌ఐ మల్లికార్జున పాల్గొన్నారు.










