ఏకసభ్య కమిషన్ సభ్యులు శ్యామూల్ ఆనంద్‌కుమార్
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : వాల్మీకుల ఎస్‌టి జాబితా పునరుద్ధరణ కోసం స్థితిగతులను పరిశీలించామని, నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తానని ఏకసభ్య కమిషన్ సభ్యులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్‌కుమార్ అన్నారు. వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సభ్యులు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతంలోని వాల్మీకుల వివరాలు, వారి జీవన విధానం, స్థితిగతులు, పూర్వం నుంచి అనాదిగా వస్తున్న ఆచారాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సర్వే ఫార్మాట్లో వివరాలు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని తెలిపారు. ఇప్పటికే 5 జిల్లాలో పర్యటించానన్నారు. మిగిలిన జిల్లాలో పర్యాటించి ఏప్రిల్‌లో ప్రభుత్వానికి పూర్తి నివేదికను అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం వాల్మీకి సంఘం, జెఎసి నాయకులు శ్యామూల్ ఆనంద్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వాల్మీకుల ఎస్‌టి పునరుద్ధరణ కోసం ఏకసభ్య కమిటీని నియమించినందుకుగాను, కమిషన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి బాధ్యతాయుతంగా నివేదిక ఇవ్వడానికి కృషిచేస్తున్న హర్షం వ్యక్తం చేశారు. శామ్యూల్ గతంలో ఇచ్చిన కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని, తమకు ఇచ్చిన బాధ్యతను త్వరితగతిన పూర్తి చేసి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు మా సహనాన్ని చేతగాని తనంగా భావించడం ఇప్పటికైనా మాని తమ న్యాయమైన డిమాండ్ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ మురళి, ఎపి వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు, సద్దల జయసింహ, బి.శ్రీనివాసులు, మహేష్, జగదీష్, భాస్కర్, కొత్తపుడుం శంకర, వలసల మంజు, మునగమానురెడ్డి శేఖర్, పిల్లి చంద్రన్న, శ్యామలమ్మ, బొంత సోమశేఖర్ పాల్గొన్నారు. బి.కొత్తకోట : మండలానికి చెందిన వాల్మీకి సంఘం నాయకులు నక్కా మహేష్ కుమార్, ఎపి విబిఎస్ గౌరవ సలహాదారులు తిమ్మయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జగదీష్ మదనపల్లెలో ఏకసభ్య కమిషన్ సభ్యులు శ్యామూల్‌కు వినతిపత్రం సమర్పించారు.










