Sep 23,2023 11:16
  • ఐక్య పోరాటాలకు ఉపాధ్యాయులు సిద్దంగా ఉండాలి

ప్రజాశక్తి - చాపాడు : యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  శనివారం కడప జిల్లా మైదుకూరులో  వేడుకలను ఘనంగా నిర్వహించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైదుకూరులోని ఉర్దూ హైస్కూల్ ఆవరణలో జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ యుటిఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బద్వేల్ మీదుగా బైక్‌ ప్రచార యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా యూటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడుకుందాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకుందాం అన్న నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు టీంల ఆధ్వర్యంలో జాత కొనసాగుతుందని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. జిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిఎస్ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఓపిఎస్ సాధించేంతవరకు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గత 49 సంవత్సరాలుగా తెలుగుజాతి కలిసికట్టుగా ఉండాలని పోరాటం సాగిస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 117 వలన విద్యార్థులకు నష్టం చేకూరుతుందన్నారు.3,4,5 తరగతుల విలీనం వలన 18వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు తయారయ్యాయన్నారు. తద్వారా నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఏకోపాధ్యాయుడు  5447 పేజీలు విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అక్టోబర్ 1న 17వేల మందితో విజయవాడలో రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందన్నారు. గత 50 సంవత్సరాలుగా యుటిఎఫ్ జండా మోసిన 1200 మంది స్ఫూర్తితో రాబోయే 50 సంవత్సరాల పాటు యూటీఎఫ్ బలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. ఈ ప్రారంభ సభకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు మహేష్ రవికుమార్, సద్దాం పాల్గొన్నారు.