Dec 28,2022 19:24

పదవ తరగతి విద్యార్థులతో డిఇఒ రాఘవరెడ్డి

ప్రజాశక్తి - రాయచోటి : పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డిఇఒ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పదవ తరగతి పునాది వంటిదన్నారు. లక్ష్య సాధన కోసం పట్టుదల, అంకితభావంతో బాగా చదవాలన్నారు. పరీక్షలలో చూచి రాతలు ఉండవని, అత్యంత పగడ్బందీగా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రథమ స్థానంలో ఉంచేందుకు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్‌ టీచర్లు ప్రణాళికా బద్ధంగా కషి చేయాలన్నారు.హొ నూతన ప్రశ్నాపత్రం పై ప్రతి విద్యార్థికీ అవగాహన పెంచాలని, అలా పెంచినప్పుడే విద్యార్థి పరీక్ష విధానానికి అనుగుణంగా విద్యాభ్యాసం సాగిస్తాడనన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సకాలంలో ఉపాధ్యాయులందరూ సిలబస్‌ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, సైన్స్‌ ఆఫీసర్‌ మార్ల ఓబుల్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కెజిబివిని సందర్శించిన డిఇఒ
రామాపురం: మండల పరిధిలోని కస్తూర్బా బాలికల పాఠశాలను బుధవారం అన్నమయ్య జిల్లా డిఇఒ రాఘవరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికలను, 8వ తరగతి బాలికలకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌ల వివరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మార్చిలో నిర్వహించబోయే 10, ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కెజిబివి ప్రత్యేక అధికారిని పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.