- స్ఫూర్తిదాయకంగా మహాసభ ప్రారంభం
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిది : బిగిసిన పిడికిళ్లు.. ఎగిసిన ఎర్రజెండాలు.. మారుమోగిన నినాదాల మధ్య సిపిఎం 23వ అఖిల భారత మహాసభ ఇకె నయనార్ నగర్‌లో బుధవారం ఉదయం స్ఫూర్తిదాయకంగా ప్రారంభమైంది. మహాసభకు ఆతిధ్యమిస్తున్న కన్నూరు జిల్లాతో పాటు కేరళ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సిపిఎం కార్యకర్తలు, వామపక్ష అభిమానులతో పాటు, సాధారణ ప్రజానీకంతో తెల్లవారుజాము నుంచే నయనార్ అకాడమీ ప్రాంతం కిక్కిరిసి పోయింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజానీకం ఎర్రజెండాను విడిచేది లేదని, ముందుకు మున్ముందుకు తీసుకుపోతామని నినాదాలు చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. వీరి నినాదాలు, పోరాట గీతాల మధ్యే ఉదయం 8 గంటల నుంచి మహాసభ ప్రాంగణానికి ప్రతినిధుల రాక ప్రారంభమైంది. కార్యకర్తలు ప్రతినిధులకు పేరుపేరునా రెడ్‌సెల్యూట్ చెప్పారు. దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా రెడ్‌సెల్యూట్ చెబుతూ స్పందించారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మహాసభ ప్రాంగణానికి వచ్చారు. సరిగ్గా 9.30 గంటలకు పార్టీ పతాకావిష్కరణ జరిగింది. సీనియర్ నేత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్.రామచంద్రన్ పిళ్లై పతాకావిష్కరణ చేశారు. ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభమైంది. మహాసభ ప్రారంభానికి ముందు ఉన్నవ ప్రయళార్, కయ్యూరు, తెలంగాణా రైతాంగ పోరాట అమరవీరుల త్యాగాలను, తెగువనూ గుర్తుకు తెస్తూ ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకుంది.























