* కడలి కెరటాలను తలపించిన రెడ్ మార్చ్
* సాగర ఘోషలా నినాదాల హోరు
* కిక్కిరిసిన సభా ప్రాంగణం
ఎకెజినగర్ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : సముద్రతీర పట్టణం కన్నూరులో ఎర్ర మహాసముద్రం ఉప్పొంగింది. విహంగ వీక్షణం చేసేవారికి ఒకేసారి రెండు సముద్రాల అరుదైన దృశ్యం కనిపించి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒకటి కన్నూరుకు కూతవేటు దూరంలో ఉన్న అరేబియా సముద్రం కాగా, మరొకటి సిపిఎం అఖిల భారత 23వ మహాసభల ముగింపు సందర్భంగా నయనార్ అకాడమీ నుంచి ఆదివారం కదిలిన జన సముద్రం. నిజానికి భారీ ఎత్తున తరలి వస్తున్న ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా తలపెట్టిన ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు సిపిఎం ప్రకటించింది. కేవలం రెడ్‌షర్ట్ వాలంటీర్ల మార్చ్ మాత్రమే ఉన్నట్లు తెలిపింది. ఒక్క కన్నూరు జిల్లాలోనే 25 లక్షల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లు ఉంటే, వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఎంపిక చేసిన 2 వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లే మార్చ్‌లో పాల్గొంటారని ప్రకటించింది.
అయితే, ఆదివారం నాటి పరిస్థితి వేరు! శనివారం ఉదయానికే వేలాదిమంది సిపిఎం కార్యకర్తలు, అభిమానులు కన్నూరుకు చేరుకున్నారు. కేరళలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. ప్రదర్శన ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే వీధుల్లో బారులు తీరారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచే రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. నయనార్ అకాడమీ నుంచి బహిరంగ సభ స్థలి అయిన ఎకెజి నగర్ (జవహర్ స్టేడియం) వరకు జనం ప్రవాహంలా కదలి వస్తున్నారు.
క్రమశిక్షణతో కదిలి ...
ప్రదర్శన ముందు భాగాన రెడ్‌షర్ట్ వాలంటీర్లు అత్యంత క్రమశిక్షణతో కదిలారు. లయబద్ధంగా వీరు చేసిన మార్చ్ కడలి కెరటాలను తలపించింది. రెడ్‌షర్ట్ వాలంటీర్లకు తోడు మార్చ్‌లో ఎగిసిన ఎర్రజెండాలు, పట్టణమంతా అలంకరించిన ఎర్ర తోరణాలతో సముద్రమే కదిలిందా అన్న భావన కలిలింది. మార్చ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ప్రారంభించారు. ప్రదర్శన ముందు భాగాన రెడ్‌షర్ట్ వాలంటీర్లు బ్యాండు వాయిస్తూ కవాతు చేశారు. వారి వెనుక సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ టాప్‌లేని వాహనంలో ర్యాలీకి తరలివచ్చిన ప్రజానీకానికి అభివాదం చేస్తూ వచ్చారు. వారి వెనుక ప్రకాశ్ కరత్, బృందాకరత్, సుభాషిణి ఆలీ, ఆ వెనుక ఇతర పొలిట్‌బ్యూరో సభ్యులు టాప్ లేని వాహనాల్లో ముందుకుసాగారు. వారి వెనుక కేంద్ర కమిటీ సభ్యులు, ఆ తరువాత ప్రతినిధులు ర్యాలీలో ఉన్నారు. వారి వెనుక కదలిన ప్రజానీకం చేసిన నినాదాల హౌరు సముద్రపు ఘోషను మించింది. పేద ప్రజల కోసం నిర్విరామ పోరాటాలు చేస్తున్న నేతలను చూసిన ప్రజలు ప్రేమాభిమానాలతో స్పందించారు. పూలు చల్లుతూ, రెడ్ సెల్యూట్ నినాదాలు చేస్తూ నీరాజనం పలికారు. సిపిఎం వర్ధిలాల్లి, విప్లవం వర్థిల్లాలి అన్న నినాదాలు మారుమ్రోగాయి. కవాతు సాగిన ప్రాంతమంతా ఎక్కడికక్కడ జనం కలిసి, ప్రదర్శనగా ముందుకు సాగారు. ప్రదర్శన నయనార్ అకాడమీ నుంచి ఫోర్ట్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్‌ల మీదుగా బహిరంగ సభా ప్రాంగణానికి చేరింది.
కిక్కిరిసిన సభా ప్రాంగణం
మార్చ్ ఎకెజి నగర్ (జవహర్ స్టేడియం) చేరుకునేటప్పటికే సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. రెండు రోజుల ముందు నుంచే కుటుంబాలతో తరలివచ్చిన వేలాదిమంది మధ్యాహ్నానికే ప్రాంగణలోకి చేరుకున్నారు. దీంతో ప్రదర్శనలో వచ్చిన పలువురు ప్రాంగణం బయటే ఉండాల్సి వచ్చింది. సభకు ముందు వేదికపై నిర్వహించిన కేరళ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.










