రాయచోటి : పాఠశాలల సందర్శనల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం, అక్రమంగా సస్పెండ్ చేయడం మానుకోవాలని, లేకపోతే ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. బుధవారం పదో తరగతి మూల్యాంకనం నిర్వహిస్తున్న సాయి ఇంజినీరింగ్ కళాశాలలో భోజన విరామ సమయంలో నిరసన తెలియ చేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ రాయచోటి రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖాధి కారులు కక్ష పూరితంగా వ్యవహ రించడం సరికాదని అన్నారు. ఎస్‌టియు నాయకులు అనిల్ మాట్లాడుతూ ఉపాద్యాయులను ఉద్దేశ పూరితంగా సస్పెండ్ చేయడం మానుకోవాలని అన్నారు. సిబతుర్ రహ్మాన్ మాట్లాడుతూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి మార్చుకోవాలని అన్నారు. యుటిఫ్ నాయకులు హరిప్రసాద్ మాట్లాడుతూ ఐఎఎస్‌లు ఇంతకు ముందు ఎపుడు ఇలా తరగతిలోకి వెళ్లి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం వంటివి చేయలేదనాన్రు. హరిబాబు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో సమస్యలు లేకుండా అధికారులు చూడాలని , ప్రవీణ్ ప్రకాశ్ ఇలా చేయడం ఉపాధ్యాయ హక్కులు కాలరాడమేనని వాపోయారు. బిటిఎ నాయకులు రామ చంద్ర మాట్లాడుతూ ఇలా అయితే భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఫ్యాపో అన్నమయ్య జిల్లా నాయకులు రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీరు విద్యావ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఉందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాల్సింది పోయి వ్యవస్థ మొత్తాన్ని లోపాల పుట్టగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని ప్రజలలో చులకన చేసేలా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు మహమ్మద్, రెడ్డెప్పరెడ్డి, రమణయ్య, ఇక్బాల్, శ్రీనివాసులు, సిద్ధయ్య, రజ్జాక్ పాల్గొన్నారు.










