Feb 10,2023 21:05

- సమావేశంలో మాట్లాడుతున్న మీగడ వెంకటేశ్వరరెడ్డి


- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో ప్రచారం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రివర్స్‌ పిఆర్‌సి వద్దని ఉపాధ్యాయులు ఉద్యమం చేసినప్పటి నుండి ఈ వేధింపులు మొదలు పెట్టారన్నారు. సిపిఎస్‌ రద్దు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి నేడు సాధ్యం కాదని జిపిఎస్‌ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో సిపిఎస్‌ రదు చేయగాలేనిది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదన్నారు. సిపిఎస్‌ రద్దయ్యే వరకూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం పరిధిలో లేని ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులను తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం హాస్యాస్పదమని తెలిపారు. కెజిబివిలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అరకొర జీతాలు పెంచడం కాదు, ఆ స్కూల్స్‌కు రెగ్యులర్‌ పోస్టులు కేటాయించి రెగ్యులర్‌ టైం స్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు వారికి మినిమం టైం స్కేల్‌ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో మీ గళం వినిపించే అవకాశం మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి నన్ను గెలిపించడం ద్వారా చేయాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు, జెవివి జిల్లా ట్రెజరర్‌ ఎన్‌.చంద్ర, చేనేత కార్మిక సంగం జిల్లా కార్యదర్శి ఎస్‌.శేషాద్రి పాల్గొన్నారు.