ప్రజాశక్తి మడకశిర : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని యుటిఎఫ్ నాయకులు విమర్శించారు. బుధవారం పట్టణంలో యుటిఎఫ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆసంఘం జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న మాట్లాడుతూ ఉపాధ్యాయులకు అందవలసిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ నేడు విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్లకుండా పోలీసుల ద్వారా కట్టడి చేయడం నియంత పాలనకు నిదర్శంగా నిలిస్తోందన్నారు. ఉక్కు పాదంతో ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఉద్యమం ద్వారా సాధించుకునేందుకు విజయవాడలో ధర్నా కార్యక్రమానికి యు టిఎఫ్ పూనుకొందన్నారు. అయితే ధర్నాను భగం చేయడానికి ఇతర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు తరలిపోకుండా పోలీసుల ద్వారా ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం దారుణమన్నారు. అంతేకాకుండా బడిపంతులపై బైండోవర్ కేసులు పెట్టడం ముందస్తుగా ధర్నాకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడం నియంతల పాలనకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల హక్కులను కాలరాసిన గత ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు అందాల్సిన పిఎఫ్ లోన్లు, క్లోజర్స్, ఎపిజిఎల్‌ఐసి లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ గుడిబండ మండలం అధ్యక్షుడు నరసింహప్ప, నాయకులు ఈశ్వర్, మహంతీష్, నంజప్ప, కదరన్న, మహాలింగప్ప, గిరియప్ప తదితరులు పాల్గొన్నారు.










