ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడతామని, ఇద్దరి మధ్య వారధిలా పనిచేస్తామని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పేర్కొన్నారు. ఆమెకు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మాన సమావేశాన్ని పట్టణంలోని బాలయేసు కళాశాలలో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో ఆమెతో నాయకులు రామచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి గత 19 నెలల నుంచి తాను అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే ఎంఇఒ పోస్టులు భర్తీ చేస్తున్నారని, కేజీవీబీ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపచేసేలా త్వరలో జీవో వస్తుందని వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 1998 డీఎస్సీ ఉపాధ్యాయులకు త్వరలో పాఠశాలల్లో నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు. సమావేశానంతరం కల్పలతారెడ్డిని మహిళా ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. 1998 డీఎస్సీ అభ్యర్థులు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రంగధాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రయివేటు స్కూల్స్ అసోసియేషన్ నాయకులు వేణుగోపాల్, రీయాజ్ తదితరులు పాల్గొన్నారు.










