ఎంఎల్‌సి పర్వతరెడ్డిని అభినందిస్తున్న దృశ్యం
ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా 'పర్వతరెడ్డి'
నెల్లూరు:తూర్పు రాయలసీమ ( చిత్తూరు , నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలు ) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎంఎల్‌సిగా వైసిపి బలపరిచిన అభ్యర్ది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప పిడిఎఫ్ అభ్యర్ధి పి.బాబురెడ్డిపై 1043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చిత్తూరులోని ఆర్‌విఎస్ లా కళాశాలలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభించగా శుక్రవారం వరకు ఓట్ల లెక్పించు ప్రక్రియ కొనసాగింది. చివర రౌండ్ వరకు విజయం నీదా.. నాదా .. సై అంటూ తీవ్ర ఉత్కంఠ నడుమన ఓట్ల లెక్కింపు సాగింది. విజయానికి కావాల్సిన మొదటి ప్రాధాన్యతా ఓట్లు ఎవ్వరికీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో కలిపి మొత్తం వైసిపి బలపరిచిన అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి 11వేలా 714 ఓట్లు రాగా, పిడిఎఫ్ అభ్యర్ధి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 10వేలా 671 ఓట్లు పోలైనట్లు అధికారులు నిర్ణయించారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలో అధికార పార్టీకి చెందిన ఓట్ల లెక్కింపు ఏజెంట్లకు, పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్ధికి చెందిన ఓట్ల లెక్పింపు ఏజెంట్లకు వివాదం తలెత్తింది. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు ప్రాంతంలో ఇరుపక్షాల మద్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. చిట్ట చివరకు వైసిపి అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 1043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు ధవీకరించారు. చిత్తూరు కలెక్టర్ ఎం. హరినారాయణ డిక్లరేషన్ అందజేశారు.










