Dec 16,2020 07:59

వెనుకబడిన మండలాల పాఠశాలలకు కచ్చితంగా న్యాయం జరగాలి. దీనికి 5 శాతం నుండి
10 శాతం ఖాళీలు కాకుండా 50 శాతం బ్లాక్‌ చేయడం వలన లాంగ్‌స్టాండింగ్‌ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. బదిలీలు పూర్తయిన తరువాత తమకు కావలసిన వారిని 'ప్రభుత్వం అక్రమ బదిలీలు' చేయడానికే 50 శాతం ఖాళీలు 'బ్లాక్‌' చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 'లాంగ్‌ స్టాండింగ్‌' వేకెన్సీలను మినహాయించి, మిగిలిన ఖాళీలలో 5 నుండి 10 శాతం మాత్రమే 'బ్లాక్‌' చేయలని ఫ్యాప్టో సంఘాలు కోరుతున్నాయి.

      ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో ముఖ్యంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో 1,80,000 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరి బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. బదిలీల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ సంఘాల పట్ల ప్రభుత్వ వైఖరి, ముఖ్యంగా విద్యా శాఖ అధికారుల వైఖరి నిరంకుశంగా ఉన్నది. ప్రతి సంవత్సరం మే నెలలో బదిలీలు జరిగితే సమస్యలు తక్కువగా ఉంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో గత బదిలీలు 2017లో జరిగాయి. నూతన ప్రభుత్వం 2019లో ఏర్పడిన తరువాత బదిలీలు జరుగుతాయని భావిస్తే, ఇప్పటిదాకా సాగదీశారు. ప్రస్తుతం ఈ బదిలీలను ప్రభుత్వం వెబ్‌ కౌన్సిలింగ్‌లోనే తప్పనిసరిగా నిర్వహిస్తామని, ఖాళీలను పెద్ద సంఖ్యలో 'బ్లాక్‌' చేస్తామని విద్యామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రకటించటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య 'ఫ్యాప్టో' ఇప్పటికే ఆందోళను చేపట్టి 13 జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల వద్ద పికెటింగ్‌ నిర్వహించి, కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించింది. వేలాది మంది ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు. 16వ తేదీ బుధవారం ఫ్యాప్టో 'చలో సెక్రటేరియట్‌' పిలుపు ఇచ్చింది. అయినా ప్రభుత్వంలో ఈ అంశాల పట్ల చలనం లేదు.
                                                    అధికారుల నిరంకుశ వైఖరి
      ప్రస్తుత పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ ఇరువురూ ఉపాధ్యాయ సంఘాల పట్ల నిరంకుశ, వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తెలుసుకోలేదు. ఇరువురూ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించటానికి ఇష్టపడటం లేదు. ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగం లోని 19వ నిబంధన సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించిందని వారు గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో యుటిఎఫ్‌, ఎపిటిఎఫ్‌, ఎస్‌టియు వంటి సంఘాలకు సుదీర్ఘమైన, పోరాట ఉద్యమ చరిత్ర ఉన్నది. గతంలో అనేక మంది అధికారులు సంఘాలను గౌరవిస్తూ, వాటితో చర్చిస్తూ సమస్యలను పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత అధికారుల ధోరణి వలనే బదిలీల ఆంశాలపై చర్చ జరగక ప్రస్తుత సమస్యలు ఏర్పడ్డాయి. మధ్యలో ఎమ్మెల్సీల చొరవతో విద్యామంత్రి జోక్యం చేసుకుని, సంఘాలతో చర్చించి 'స్టేషన్‌ పాయింట్లు' వంటి కొన్ని సమస్యలు పరిష్కరించారు. కాని ప్రధానమైన వెబ్‌ కౌన్సిలింగ్‌ స్థానంలో మాన్యువల్‌ కౌన్సిలింగ్‌, ఖాళీలన్నీ చూపించటం వంటి సమస్యలు యథాతథంగా ఉన్నాయి. ఇటీవల ఆందోళనల సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్‌ జి. నారయణ రెడ్డి, సెక్రటరీ జనరల్‌ ఎన్‌. నరహరి లకు చార్జ్‌ మెమోలు ఇవ్వటం, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాలలో ఉపాధ్యాయులపై కేసుల నమోదు...కక్ష సాధింపు చర్యలలో భాగమే. ఈరకమైన నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణులు సరైనవి కావు.
                                               ప్రమాదంలో ప్రాథమిక పాఠశాలలు
      రేషనలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు వుండాలన్న నిర్ణయం హర్షణీయం. అయితే 40 మందికి, 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరే టీచర్లు, 81-90కి మధ్య విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు టీచర్లు ఉండాలనటం ప్రాథమిక పాశాలలను నిర్వీర్యం చేయడమే కాక, ఆ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. 40కి పైన విద్యార్థులున్న పాఠశాలలకు ముగ్గురు ఉపాధ్యాయులు, 60కి పైన విద్యార్థులున్న చోట నలుగురు ఉపాధ్యాయులను, 80కి పైన విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు ఇప్పుడున్న మాదిరిగానే ఐదుగురు ఉపాధ్యాయులను వుంచి, ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించాలి. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య సరిపోని పక్షంలో, నూతన పోస్టులు మంజూరు చేసే, ప్రాథమిక పాఠశాలలను కాపాడాలి. కాని అధికారులు జాతీయ విద్యా హక్కు చట్టం పేరుతో, 1:30 అనే పేరుతో ప్రాథమిక పాఠశాలల మనుగడను దెబ్బ తీసే పనిలో ఉన్నారు.
                                                     వెబ్‌ కౌన్సిలింగ్‌ వద్దు
      ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్త కంఠంతో వెబ్‌ కౌన్సిలింగ్‌ స్థానంలో మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ కోరుతున్నాయి. విద్యామంత్రి వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారానే బదిలీలు జరుపుతామని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని చెబుతున్నారు. వెబ్‌ కౌన్సిలింగ్‌లో ఎస్‌జిటి ఉపాధ్యాయులు 3 వేల నుండి 4 వేల ఆప్షన్లు ఇవ్వవలసిన పరిస్థితులున్నాయి. ఇది చాలా ఇబ్బందికరం. 8 సంవత్సరాలు నిండినవారు, రేషనలైజేషన్‌కు గురైనవారు తప్పనిసరిగా బదిలీ కావలసిన సందర్భంలో...2015 బదిలీలలో సుదూరంగా విసిరి వేయబడ్డారు. భార్యాభర్తల కేసుల్లో దగ్గరగా రావలసిన వారు దూరంగా వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వెబ్‌ కౌన్సిలింగ్‌కు ఉపాధ్యాయులు అప్లికేషన్‌ పెడుతుంటే, సర్వర్‌ పని చేయక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కనీసం ఎస్‌జిటి లకయినా మాన్యువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని కోరుతున్నాయి.
ఖాళీలను 'బ్లాక్‌' చేయవద్దు
    ఈ బదిలీలలో ప్రధానంగా 'ఖాళీలు బ్లాక్‌' చేయటం వలన ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గతంలో వెనుకబడిన ప్రాంతాల/మండలాల పాఠశాలలు నష్టపోకుండా ఉండటానికి 5 నుండి 10 శాతం 'ఖాళీలు బ్లాక్‌' చేసేవారు. కానీ ఇప్పుడు చాలా జిల్లాలలో 40 శాతం నుండి 50 శాతం 'ఖాళీలు బ్లాక్‌' చేశారు. దీనితో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళననకు గురవుతున్నారు. జిల్లాలో ఒకే కేడర్‌లో మంజూరైన పోస్టుల సంఖ్య కంటే, తక్కువ మంది పని చేస్తుంటే ఆ తేడా ఖాళీలను 'బ్లాక్‌' చేయడం జరుగుతుందని, ఆ విధంగా బ్లాక్‌ చేసేటప్పుడు అన్ని మండలాలలో 1,2, 3 కేటగిరీ లలో దామాషా ప్రకారం సదరు ఖాళీలను బ్లాక్‌ చేయడం జరుగుతుందని...ఆ విధంగా బ్లాక్‌ చేయని పక్షంలో ఉపాధ్యాయులు 1,2 మరియు మెరుగైన కేటగిరి-3 ఖాళీలు కోరుకుంటూ...మారుమూలల్లో ఉన్న కేటగిరి 3,4 ఖాళీలను కోరుకోవడంలేదని, ఆ మేరకు వెనుకబడిన మండలాలలో పాఠశాలలు, విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వం వాదిస్తున్నది. వెనుకబడిన మండలాల పాఠశాలలకు కచ్చితంగా న్యాయం జరగాలి. దీనికి 5 శాతం నుండి 10 శాతం ఖాళీలు కాకుండా 50 శాతం బ్లాక్‌ చేయడం వలన లాంగ్‌స్టాండింగ్‌ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. బదిలీలు పూర్తయిన తరువాత తమకు కావలసిన వారిని 'ప్రభుత్వం అక్రమ బదిలీలు' చేయడానికే 50 శాతం ఖాళీలు 'బ్లాక్‌' చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో మారుమూల ప్రాంతం నుండి బదిలీ అయిన వారిని 'రిలీవర్‌' వచ్చిన తరువాత రిలీవ్‌ చేసేవారు. ఈ సారికూడా ఆ పద్ధతి అనుసరించవచ్చు. ప్రస్తుతం 'లాంగ్‌ స్టాండింగ్‌' వేకెన్సీలను మినహాయించి, మిగిలిన ఖాళీలలో 5 నుండి 10 శాతం మాత్రమే 'బ్లాక్‌' చేయలని ఫ్యాప్టో సంఘాలు కోరుతున్నాయి.
                                                      'చైల్డ్‌ ఇన్‌ఫో'లో నమోదు
      విద్యార్థుల మీడియం (ఇంగ్లీషు, తెలుగు) పరిగణన లోకి తీసుకుని, 'చైల్డ్‌ ఇన్‌ఫో' లో నమోదుకు అవకాశం కల్పించి, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయించాలి. అధికారులు చెప్పిన నవంబర్‌3 నాటికి వివిధ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు నిర్ణయించాలి. కొన్ని పాఠశాలల్లో పిల్లలు చేరినప్పటికి, సాంకేతిక కారణాల వలన నవంబర్‌ 3 నాటికి నమోదు కాలేదు. వాటిని కూడా పరిగణన లోకి తీసుకోవాలి.
     పైఅంశాలపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, విద్యామంత్రి చొరవ తీసుకుని, అధికారులతో, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, సమస్యలు పరిష్కరించాలి.
 

(వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, కె.యస్‌.లక్ష్మణరావు

ఉపాధ్యాయ బదిలీల ప్రహసనం
సెల్‌ : 94402 62072)