Feb 12,2022 08:55
  • బిల్లుల చెల్లింపునకు కేంద్రం మీనమేషాలు
  • ఇసుక, సిమెంట్‌ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం
  • అప్పుల్లో కాంట్రాక్టర్లు
  • ముందుకుసాగని మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు
  • ఏటా రూ.వందల కోట్లు రద్దు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్‌ఆర్‌ఇజిఎస్‌) మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో విజయనగరం జిల్లా వాసుల ఉపాధికి గండిపడుతోంది. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, సిమెంట్‌ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఉపాధి కరువై పనుల కార్మికులు పొట్టచేతపట్టుకుని మహానగరాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. దీంతో, జిల్లా అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ఎండమావిగా మారుతున్నాయి. బిల్లులు అందక కాంట్రాక్టర్లు అప్పులపాలవుతున్నారు. కొత్త పనులు చేసేందుకు వారు ముందుకు రాలేకపోవడంతో ఏటా వందల కోట్ల రూపాయలు రద్దవుతున్నాయి. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజులు పని కల్పించాల్సింది. ఈలెక్కన 2021-22 ఆర్థిక సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 4.66 లక్షల మందికి 2.60 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటికే 120 శాతం పనిదినాలు కల్పించారు. ఇలా ఎక్కువ పనిదినాలు పొందిన జిల్లాగా దేశంలోనే గుర్తింపు వస్తోంది. ఇందుకుగాను అధికారులు ఏటా అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు. ఇలా ఉపయోగించుకున్న పనిదినాలకు వెచ్చించిన మొత్తం బిల్లుపై 40 శాతం నిధులు మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.460 కోట్లు రావాల్సి ఉంది. నిధుల విడుదల జాప్యం వల్ల ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన పనులే జరిగాయి. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. దీంతో, ఈ నిధులతో చేపట్టిన సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఆర్‌బికె కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ సెంటర్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. 2019-20, 2020-21 సంవత్సరాల్లో చేసిన పనికి తగట్టు నిధులు విడుదల చేయలేదు. వేపాడ మండలం ఆతవ గ్రామ సచివాలయం, ఆర్‌బికె, వెల్‌నెస్‌ సెంటర్‌ ఒకే సముదాయంలో రూ.45 లక్షలతో నిర్మించతలపెట్టారు. ఈ మూడు భవనాలు స్లాబ్‌ లెవెల్‌ వరకు నిర్మించారు. రూ.18 లక్షలు మాత్రమే చెల్లింపు జరిగింది. దీంతో, చేసిన పనికి తగ్గట్టు బిల్లులు అందకపోవడంతో అప్పుల పాలైన కాంట్రాక్టర్‌ మిగిలిన పనులు పూర్తి చేయలేదు. సీతానగరం మండలం లక్ష్మీపురంలో సచివాలయం, ఆర్‌బికె కేంద్రాలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. ఇలా ఈ రెండేళ్లకు సంబంధించి నిర్మాణ బిల్లులు సుమారు రూ.500 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో, ఆర్థిక ఇబ్బందుల్లో పడిన గుత్తేదారులు నిర్మాణాలపై ఆసక్తి చూపకపోవడంతో 2020-21లో రూ.211 కోట్లు, 2021-22లో రూ.300 కోట్లు రద్దయ్యాయి. దీనిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తనకు పట్టనట్లు వ్యవహరించడంతో పాటు నిర్మాణ పనులకు ఇసుక, సిమెంట్‌ సరఫరా తగినంతగా చేయడం లేదు. కేంద్రం ఇప్పడు రిలీజ్‌ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచకపోతే మార్చిలోపు అంటే 50 రోజుల్లో ఇంత మొత్తం ఖర్చు చేయడం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు అంటున్నారు.

                                                                  ఏడాదైనా బిల్లు చెల్లించలేదు

'ఉపాధి'కి ఎసరు !

మా గ్రామంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో ఆర్‌బికె భవనాన్ని పూర్తి చేసి ఏడాది దాటింది. వివిధ దశల్లో రూ.7 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని చెప్తున్నారు. ఇది నా ఒక్కడి సమస్యే కాదు. ప్రతి గ్రామంలోనూ నాలాంటి బాధితులు ఉన్నారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో వెచ్చించిన పెట్టుబడి కూడా అసంపూర్తి భవనాలను పూర్తి చేయలేకపోతున్నాం. కొత్త నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాం.
                                                      - కెల్ల త్రినాథ్‌, కాంట్రాక్టర్‌, దుప్పాడ, విజయనగరం మండలం