- కష్టకాలంలోనూ కరుణ చూపని కేంద్రం
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కింద గ్రామీణ ప్రాంతాల్లో పనులకు కేంద్ర ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 73వేల కోట్ల రూపాయలతో సరిపెట్టింది. దీని కింద 2021-22లో చేసిన ఖర్చు కన్నా ఇది 25వేల కోట్ల రూపాయలు తక్కువ! పార్లమెంటుకు మంగళవారం నాడు సమర్పించిన బడ్జెట్ పత్రాల్లో 2021-22 వ సంవత్సరంలో ఉపాధి హామీ కింద 73 వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, 98 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకోకపోవడం, కరోనా పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటంతో ఉపాధి హామీకి ప్రాధాన్యత పెరిగింది. సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వేలో సైతం ఉపాధి హామీకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా డిమాండ్ ఉందని పేర్కొంది. కరోనా కారణంగా విధించిన మొదటి లాక్‌డౌన్ కాలంతో పోలిస్తే ఈ పథకం మీద కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ, కరోనా విజృంభణకు ముందు రోజులతో పోలిస్తే పనుల కోసం నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. ఈ నేపథ్యంలో కొంత మేరకైనా ఉపాధి కేటాయింపులు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమైంది. అయితే, ఇప్పటికే చేసిన వ్యయం కన్నా తక్కువ కేటాయింపులతో కేంద్రం సరిపెట్టడం గమనార్హం. నిజానికి తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన 73 వేల కోట్ల రూపాయలు 2020-21 ఆర్థిక సంవత్స రంలో చేసిన వ్యయంతో పోల్చినా కూడా తక్కువే. ఆ ఏడాది బడ్జెట్‌లో 61,500 కోట్ల రూపాయలను ప్రతిపాదించగా 1,11,500 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
ఎంత కావాలి....?
పలువురు సామాజిక అధ్యయన వేత్తలతో ఉన్న పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారంటీ ప్లాట్‌ఫామ్ చేసిన నిర్ధారణ ప్రకారం ఈ ఏడాది ఉపాధి హామీ చట్టం కనీస స్థాయి అమలుకు 2.64 లక్షల కోట్ల రూపాయలు కావాలి. అంత మొత్తం కేటాయింపులు చేస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ చట్టం కింద పనులు పొందిన వారికి ఈ ఏడాది కూడా 100 రోజులు కనీసం పని కల్పించడం సాధ్యమవుతుందని ఆ సంస్థ పేర్కొంది. పెద్ద ఎత్తున పాత బకాయిలు పేరుకుపోవడమే దీనికి కారణం. '2021-22లో ఇలా పాత బకాయిల కోసం 25వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతకు ముందు ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన కేటాయింపుల్లో 20 శాతం నిధులు ఇలా పాత బకాయిలను చెల్లించడానికే సరిపోతున్నాయి.' అని ఆ సంస్థ పేర్కొంది.
ఈ ఏడాది కూడా 20 నుండి 25 వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుకునే అవకాశం ఉందన్నది ఆ సంస్థ అంచనా వేసింది. బకాయిలు చెల్లింపులు పోనూ ఉపాధి పనులకున్న డిమాండ్‌ను తీరుస్తూ కనీస వేతనాలు చెల్లించాలంటే కనీసం 2.64 లక్షల కోట్ల రూపాయలు కావాలని ఆ సంస్థ పేర్కొంది. ఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్ మోర్చా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిస్థాయిలో పట్టాలెక్కించాలంటే కనీసం 3.62 లక్షల కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేటాయించాలని డిమాండ్ చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం చేసిన 73 వేల కోట్ల రూపాయల కేటాయింపు ఏ మాత్రం చాలదన్నది ఇట్టే అర్ధమవుతోంది.











