May 22,2023 21:01

- కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ : ఉపాధి హామీ చట్టం కోసం కేంద్ర బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జయరామయ్య అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి పని ప్రదేశాల్లో పర్యటనలు నిర్వహించి కూలీలతో చర్చించి సమస్యలు తెలుసుకున్నామని వివరించారు. ఉపాధి పనుల్లో ఫోటో హాజరు వల్ల కూలీలు నష్టపోయే అవకాశం ఉందన్నారు. గతంలో ఉన్న మౌలిక సదుపాయాలైన టెంటు సౌకర్యం, మంచినీళ్లు, మజ్జిగ, మెడికల్‌, బీమా పథకం, పనిముట్లు, సమ్మర్‌ అలవెన్సు, మేటీలకు అలవెన్స్‌ లాంటివి ఏమీ లేకుండా చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కూలీలు పనిచేసే చోట సౌకర్యం లేకపోవడంతో ఎండ దెబ్బకు అక్కడికక్కడే మరణిస్తున్నా పాలకులు స్పందించక పోవడం శోచనీయమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి తక్కువ బడ్జెట్‌ కేటాయించి గ్రామీణ పేదలకు చట్టాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి కూలీల ఉసురు తీస్తున్న బిజెపి ప్రభు త్వానికి పతనం తప్పదన్నారు. నిధులు కేటాయించని పక్షంలో కూలీలతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, నాయకులు ఓబులమ్మ సంఘీభావం తెలిపారు. అనంతరం రెండు పూటల పని రద్దు చేయాలని, సమ్మర్‌ అలవెన్సు కొనసాగించాలని, కుటుంబానికి 200 పనిదినాలు, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి హామీని పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని కోరుతూ డిఆర్‌ఒ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆయన స్పందిస్తూ డ్వామా పీడీతో చర్చించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సురేంద్రరెడ్డి, నరసింహ, రామచంద్ర, వర్మ, శివయ్య, పెంచులయ్య, రమేష్‌ బాబు పాల్గొన్నారు.