'ఉపాధి' పనులు పరిశీలన
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని చెరువు కట్ట వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను సిపిఎం మండల కార్యదర్శి అన్వర్ బాషా పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని మండలం ఉపాధి హామీ ఎపిఒ దయాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అన్వర్ భాషా మాట్లాడుతూ కొంతమందికి సక్రమంగా పేమెంట్ పడడం లేదని, మరో కొంతమందికి జాబ్‌కార్డులు లేక ఉపాధి హామీ పనికి రాలేక పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అర్హులైన ప్రతివారికి జాబ్‌కార్డు మంజూరు చేయాలని, అలాగే ఉపాధి పనులు దగ్గర మెడికల్ కిట్టు పని ప్రదేశాలలో తప్పనిసరిగా ఉండాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం పోరాడి సాధించిన చట్టాన్ని, నేడు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ బడ్జెట్లో సరిపడినంత నిధులు కేటాయించడం లేదన్నారు. అరకొర నిధులతో ఈ పనులు జరుగుతున్నాయన్నారు. ఉపాధి హామీ కూలీల పని దినాలను ఒక జాబ్ కార్డుకు 100 రోజుల నుండి 200 రోజులకు పెంచాలన్నారు. పనులు లేని కాలంలో చాలామందికి ఉపాధి పనులే ఆధారమవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచి, కూలీల కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.










