ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన పెండింగు నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఉపాధి కార్మికుల వేతనాలతోపాటు (వేజ్) మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.2,300 కోట్లు రావాల్సి ఉంది. మరో నెలన్నరలో 2021-22వ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉపాధి కార్మికులకు పెండింగు వేతనాలను క్లియర్ చేయడంతోపాటు మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులకు కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కార్మికుల వేతనాల చెల్లింపునకు ఇప్పటి వరకు రూ.5,065.51 కోట్లను విడుదల చేయగా, మెటీరియల్ కాంపోనెంటు కింద రూ.1,703 కోట్లే వచ్చాయి. రెండింటికీ ఇంకా రూ.2,303.77 కోట్లు రావాల్సి ఉంది.ఈ నెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు వేజ్ కాంపోనెంటు కింద కేవలం రూ.7.95 కోట్లనే కేంద్రం విడుదల చేసింది. మంజూరైన నిధుల్లో ఇంకా రూ.332.85 కోట్ల పెండింగు ఉండగా, అదనంగా చేపట్టిన పనులకూ డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. మెటీరియల్ కాంపోనెంటు నిధులను చివరిగా గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో రెండు విడతల్లో రూ.1,703 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఐదు నెలలుగా మెటీరియల్ కాంపోనెంటు నిధులు రాకపోవడంతో బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి.










