ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామంజులు
సంబేపల్లి (రాయచోటి టౌన్) : వేసవిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. బుధవారం సంబేపల్లి మండలం గుట్టపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల పని ప్రదేశాన్ని పరిశీలించి కూలీల సమస్యల అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ ఫథకాన్ని నిర్వీర్యం చేసి కాలక్రమేణ ఈ పథకానికయ్యే ఖర్చును పెట్టుబడిదారులకు ఇవ్వాలని కుట్రపన్ను తున్నాయని విమర్శించారు. ఫలితంగానే నెలల కొద్ది బిల్లులు పెండింగ్‌లో ఉంచడం, బడ్జెట్‌లో నిధులు తగ్గించడం ఉపాధి నిధులను ఇతర అవసరాలకు మల్లించడం వంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. వేసవిలో మజ్జిగ, తాగునీరు షామియానా షెల్టర్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని పేద ప్రజానీకం 65 శాతం ఉన్నారని. మరోవైపు వలసలు వెళ్తున్నారు తెలిపారు. వలసలు నివారించాలంటే భూపంపిణీతో పాటు ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పొడిగించి ప్రతి రోజు 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటరమణ, అశోక్, గంగయ్య, కిషోర్, మంగమ్మ, రాధ, పలువురు ఉఫాధి కూలీలు పాల్గొన్నారు.










