May 06,2023 22:03

ఫొటో: మాట్లాడుతున్న డ్వామా ఎపిడి గాయత్రిదేవి

ఉపాధి కూలీలకు పనిదినాలు కల్పించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు సుమారు 2 లక్షల 600 పని దినాలను కల్పించాలని డ్వామా ఎపిడి గాయత్రీ దేవి సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందితో ఆమె సమావేశమై సిబ్బందికి ఫీల్డ్‌ అసిస్టెంట్లకి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాబ్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ వందరోజుల పని దినాలను కల్పించాలని పనిచేసిన కూలీకి 250 నుండి 272 వస్తుందని అవగాహన కల్పించి పనులను కల్పించాలన్నారు.
హార్టికల్చర్‌ పరిధిలో 4.5 ఎకరాల లక్ష్యాన్ని ఇచ్చారని మండలంలో రైతుల నుండి అంతకంటే ఎక్కువ ఎకరాలలో హార్టికల్చర్‌ పనులు చేసుకునేలా రైతులను ప్రోత్సహించి హార్టికల్చర్‌ వైపు పనులను చేపట్టాలన్నారు. వేసవికాలం కావడంతో పని ప్రదేశాలలో షెల్టర్‌ తాగునీరు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను దగ్గర ఉంచుకొని కనీస అవసరాలు కల్పించాలన్నారు. కూలీలతో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిర్థేశించిన కొలతల ప్రకారం పనులు చేయించి కనీస కూలి వచ్చేలా చూడాలన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కూలీల సంఖ్యను పెంచి పనిదినాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపిఒ సుభాషిని, ఈసీ సువార్తయ్య, టిఎలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.