నినాదాలు చేస్తున్న దృశ్యం
ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకుందాం..
నెల్లూరు:కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేటాయించే నిధుల్లో కోత విధించి ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుందని, ఈ ప్రయత్నాన్ని వ్యవసాయ కార్మిక సంఘం అడ్డుకొని తీరుతుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నందిపోగు రమణయ్య అన్నారు. మంగళవారం నగరంలోని ప్రధాన తపాల కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి ఉపాధి హామీ పథకం సాధించుకున్నామని, సుమారు రూ. 40 వేల కోట్లతో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకం వలన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులకు పనులకు భరోసా కలిగిందన్నారు. కాల క్రమంలో ఈ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా ప్రభుత్వం మార్చిందన్నారు. దేశంలో అనేక గ్రామాలలో కార్మికులకు పని దొరకడం వల్ల ఆహార భద్రత కొరత తీరి పేదలు సమద్ధిగా జీవిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముకాస్తూ కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాన్ని నీరుగార్చుతుందన్నారు. అందులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రూ.29 వేల కోట్లు ఉపాధి హామీ పథకం లో కోత విధిస్తూ బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా, ఆదినారాయణ, నాగేంద్ర, ముక్తియర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఫాతిమా, గౌసియా, హసీనా, విజయమ్మ, రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు










