ఉపాధి హామీ నిధులు గోల్మాల్
- ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : పేదవారు వినియోగించుకోవాల్సిన ఉపాధి హామీ పనులను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బడా భూస్వాములకు ఉపాధి హామీ నగదు బదిలీ చేసి ప్రభుత్వ ఖజానాను కాజేసిన నిడుముసలి ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ నేత ఎస్‌కె షాన్వాజ్ డిమాండ్ చేశారు. సోమవారం నిడుముసలి ఉపాధి హామీ పనుల కూలీలతో ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ నాగేంద్రబాబుకు నిడుముసలి గ్రామస్తులు తమ గోడు వినిపించుకుంటూ వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ గ్రామంలో పనిచేసే కూలీలకు ఉపాధి పనులు కల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బడా భూస్వాములకు జాబ్‌కార్డ్ కల్పించి పని చేయకుండానే ఉపాధి హామీ నగదును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా ఆరు లక్షల పైచిలుకు ఉపాధి హామీ నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. పలుమార్లు ఎన్‌ఆర్‌జిఇఎస్ ఎపిఒకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. వెంటనే ఉన్నతాధికారులు చొరవచూపి ఫీల్డ్ అసిస్టెంట్‌పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. తమకు వెంటనే పని కల్పించాలని లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.










