Dec 02,2022 21:28

పెనుకొండలో ర్యాలీ చేస్తున్న వ్యకాసం నాయకులు

          పెనుకొండ : వ్యవసాయ కూలీలుకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు, భూమిలేని ప్రతి పేద కుటుంబానికి భూమి ఇచ్చేంత వరకు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రైతుసంఘం, ఐద్వా జిల్లా నాయకులు ఎం.ఇంతియాజ్‌, వెంకటేష్‌, హరి, గౌతమి పాల్గొన్నారు. ముందుగా పట్టణ పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్‌యార్డు మహాసభ ప్రాంగణం వద్ద సంఘం నాయకురాలు వెంకటలక్ష్మి జెండాను ఆవిష్కరించారు. వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న అధ్యక్షత నిర్వహించిన మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదలందరికీ భూమి పంచడం ద్వారా వారికి ఉపాధి లభిస్తుందన్నారు. చాలా మంది పేదలు ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నారని, వారందరికీ వెంటనే సాగుపట్టాలు ఇవ్వాలన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి కుటుంబానికీ రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ కూలీలను వలసలు నుంచి ఆదుకుంటున్న ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచి, కూలి రూ.600 ఇవ్వాలన్నారు. 'ఉపాధి'లో కోతపేట్టే చర్యలను బిజెపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి, వ్యవసాయ కూలీలను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. కూలీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం నాయకులు ప్రవీణ్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.