Mar 30,2022 08:01
  • 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
  • నిధుల విడుదలలో కేంద్రం జాప్యం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉపాధి హామీ పథకం బకాయిలు మళ్లీ పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రూ.3,340.64 కోట్లమేర నిధులు రావాల్సి ఉంది. మెటీరియల్‌ కాంపోనెంటు నిధులు రూ.800.77 కోట్లను కేంద్రం ఆరు నెలలుగా విడుదల చేయడం లేదు. మరోవైపు ఉపాధి కార్మికుల వేతనాల చెల్లింపునకు 2,539.87 కోట్ల నిధులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 23.50 కోట్ల పని దినాలను మంజూరు చేయగా, తొలి ఆరు నెలల్లోనే ఆ పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ వినతి మేరకు సుమారు మూడు కోట్ల అదనపు పని దినాలను కేంద్రం మంజూరు చేసింది. ఈ నెలాఖరు కల్లా 30 కోట్ల పని దినాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు సిఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా నిర్దేశించారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.7,749.45 కోట్ల విలువైన ఉపాధి పనులు జరగ్గా, కేంద్రం రూ.6,913.47 కోట్లనే మంజూరు చేసింది. గ్రామాల్లో ఉపాధి పనులు చేసిన కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు రూ.5,349.60 కోట్లను విడుదల చేయగా, ఈ నెల 25వ తేదీ వరకు రూ.5,209.58 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాయి. అన్‌స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికుల వేతనాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. మంజూరైన నిధుల్లోనే రూ.1,564.87 కోట్లను పెండింగు పెట్టగా, విడుదల చేసిన నిధుల్లో ఇంకా రూ.140.02 కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు జరిగిన పని విలువలో వేతనాల రూపంలో చెల్లించేందుకు రూ.846.92 కోట్లు మంజూరు కావాల్సి ఉంది.
 

                                                 మెటీరియల్‌ కాంపోనెంటు మాటే లేదు

రాష్ట్రానికి ఆరు నెలలుగా మెటీరియల్‌ కాంపోనెంటు విడుదల కావడం లేదు. రాష్ట్రానికి కేటాయించిన పని దినాల ఆధారంగా రూ.2,504.65 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంటు రావాల్సి ఉండగా, సెప్టెంబరు నాటికి రూ.1,703.88 కోట్లనే కేంద్రం విడుదల చేసింది. ఆరు నెలలుగా రూ.800.77 కోట్లను విడుదల కావడం లేదు. ఆర్‌బికె, సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్ర అధికారులు పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా ఫలితం లేదు.

'ఉపాధి' బకాయి రూ.3,340 కోట్లు