Feb 23,2022 11:08
  • విద్యార్థులు : 590 మంది
  • అధ్యాపకులు : సున్నా
  • అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలకు అధ్యాపకుల కొరత
  • మూడేళ్లుగా ప్రిన్సిపల్‌తోనే నిర్వహణ
  • ఎస్‌ఎఫ్‌ఐ యాత్రలో వెలుగులోకి..

ప్రజాశక్తి - అరకులోయ (విశాఖ) : గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అరకులోయలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్‌ను నియమించడంతోనే చేతులు దులుపుకుంది. కళాశాలను ఏర్పాటు చేసి మూడేళ్లయినా నేటికీ అధ్యాపకులను, బోధనేతర సిబ్బందిని నియమించలేదు. ఈ కళాశాలతో పాటు ఏర్పాటైన రాష్ట్రంలోని కొన్ని కళాశాలలకు అధ్యాపకులను నియమించగా, గిరిజన విద్యార్థినులు విద్యనభ్యస్తోన్న అరకులోయ కాలేజీకి మాత్రం ఒక్కరినీ నియమించకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ వివక్షకు, నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన విద్యారంగ పరిరక్షణ యాత్రలో ఈ విషయం తేటతెల్లమైంది.
    విశాఖ ఏజెన్సీలో మహిళా డిగ్రీ కళాశాల లేకపోవడంతో డిగ్రీ విద్యనభ్యసించడానికి విద్యార్థినులు మైదాన ప్రాంతామైన ఎస్‌.కోట, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. లేదంటే పాడేరు, అరకు డిగ్రీ కళాశాలల్లో చేరాల్సి వచ్చేది. ఏజెన్సీలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘాల సుదీర్ఘ పోరాట ఫలితంగా 2019లో అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వందలమంది ఇక్కడ ప్రవేశం పొందారు. ప్రభుత్వం కళాశాలనైతే మంజూరు చేసిందిగానీ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని నేటికీ నియమించలేదు.
    కళాశాల ప్రారంభించినప్పుడు ఎటువంటి వసతులు లేకపోవడంతో ప్రభుత్వ కో ఎడ్యుకేషన్‌ డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు కొనసాగించారు. ఉదయం కో ఎడ్యుకేషన్‌ కళాశాల విద్యార్థులకు, మధ్యాహ్నం మహిళా కళాశాల విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అధ్యాపకుల కొరత ఉండటంతో అరకులోయ, పాడేరు కో ఎడ్యుకేషన్‌ డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు తాత్కాలికంగా విద్యా బోధన చేస్తున్నారు. మహిళా కళాశాలను ప్రారంభించినప్పటి నుంచి ఇదే పద్ధతితో కాలం వెళ్లదీస్తున్నారు. డిగ్రీ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థినులు పోరాటాలు చేయడంతో ఐదు నెలల క్రితం ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్‌ను మాత్రమే నియమించి చేతులు దులుపుకుంది. ఈ కళాశాలలో 590 మంది విద్యార్థినులు బిఎ, బికాం, కంప్యూటర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, బిఎస్‌సి బిజెడ్‌సి, ఎంపిసి, ఎంపిసిఎస్‌ గ్రూపుల్లో విద్యనభ్యసిస్తున్నారు. అధ్యాపకులు లేకపోవడంతో ఈ ఏడాది మొదటి సంవత్సరంలో వంద సీట్లు భర్తీ కాలేదని ప్రిన్సిపల్‌ రామకృష్ణ తెలిపారు. కనీసం ప్రిన్సిపల్‌కు గది కూడా లేకపోవడంతో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌ గదిలో నుంచే ఆయన విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అరకులోయ సమీపంలోని పానిరంగిని గ్రామంలో మహిళా డిగ్రీ కళాశాలకు పది ఎకరాలు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ ఉచ్చుతార్‌ శిక్ష అభియాన్‌ ఫండ్‌ కింద భవనాలకు రూ.12 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

                                                                     నిర్వహణ కష్టంగా ఉంది

మహిళా డిగ్రీ కళాశాల నిర్వహణ కష్టంగా ఉంది. అన్ని పనులు ఒక్కడినే చేసుకుంటున్నారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఒక్కరు కూడా లేకపోవడంతో కో- ఎడ్యుకేషన్‌ కళాశాల సిబ్బంది సాయంతో నెట్టుకొస్తున్నాను. ప్రిన్సిపల్‌గా ఇక్కడకు వచ్చి ఐదు నెలలైనా ఇంతవరకూ జీతం కూడా ఇవ్వలేదు. అరకులోయ, పాడేరు కో ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కొంతమంది అధ్యాపకులు వచ్చి తాత్కాలికంగా తరగతులు చెప్పి వెళ్ళిపోతున్నారు. విషయాన్ని ఇటీవల రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాను. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. సిబ్బందిని నియమిస్తే ఫలితముంటుంది.
                                                                                                            - రామకృష్ణ, ప్రిన్సిపల్‌,
                                                                                                     అరకులోయ మహిళ డిగ్రీ కళాశాల